హాట్ హాట్ గా ఏపీ రాజకీయం-రెండేళ్ల ముందే జనంలోకి నేతలు-ముందస్తు సంకేతమేనా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు కావస్తోంది. మరో రెండేళ్ల తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రాజకీయ పార్టీలు,వాటి అధినేతలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం త్వరలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయా అన్నట్లే ఉంది. ఓవైపు సీఎం జగన్ జిల్లాల టూర్ ప్రారంభిస్తే విపక్ష నేత చంద్రబాబు మే తర్వాత ఏకంగా రాష్ట్రపర్యటన ప్రారంభించబోతున్నారు. అటు పవన్ కౌలు రైతు భరోసా యాత్రలు చేస్తుంటే బీజేపీ నేత సోము వీర్రాజు గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు.

వేడెక్కిన ఏపీ రాజకీయం
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. వైసీపీ సర్కార్ మూడేళ్లు ఇంకా పూర్తి చేసుకోనే లేదు. అప్పుడే రెండేళ్ల తర్వాత జరగాల్సిన ఎన్నికల వాతావరణం, ఆ వేడి ఇప్పుడే కనిపించేస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ రోజూ జిల్లాల పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యల్ని గమనిస్తే ముందస్తు ఎన్నికలు ఖాయమేనా అన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయనతో పాటు విపక్ష నేతలంతా జనంలోకి క్యూ కడుతున్నారు. ఒక్క రోజు ఆలస్యమైనా తమ అవకాశాలపై దెబ్బ పడుతుందేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

జగన్ జిల్లా యాత్రలు
సీఎం అయిన దగ్గరి నుంచి నిన్న మొన్నటివరకూ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే అన్ని పనులు చక్కబెట్టిన జగన్ తాజాగా జిల్లాల పర్యటనకు బయలుదేరారు. విపక్షాల కంటే ముందే జనంలోకి దూకేశారు. విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం.. ఇలా ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ జనాలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల తన సంక్షేమ పాలనలో ఫీడ్ బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు విపక్షాలను నమ్మవద్దంటూ జనాన్ని కోరుతున్నారు. విపక్షాలపై ఎన్నికల ప్రచార సమయంలో చేసినట్లుగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

చంద్రబాబు టూర్
అటు టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు కూడా రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. నిన్న మొన్నటివరకూ హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగిస్తూ అప్పుడప్పుడూ అమరావతికి వచ్చిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు జగన్ దూకుడుతో తాము కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో ఒంగోలులో మహానాడు పెట్టి, అనంతరం రాష్ట్ర పర్యటనకు వీరిద్దరూ శ్రీకారం చుట్టబోతున్నారు. జగన్ సర్కార్ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అంచనా వేసుకుంటున్న వీరిద్దరూ జనాల్లోకి వెళ్లి దాన్ని సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

జనంలోనే పవన్,సోము కూడా
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం జనంలోనే ఉంటున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య పొత్తు ఉన్నా అవేవీ పట్టించుకోకుండా సొంతంగా ఈ రెండు పార్టీలు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పవన్ కౌలు రైతు భరోసా యాత్రలో జనంలోకి వెళ్తుండగా.. అటు సోము వీర్రాజు గుళ్లను సందర్శిస్తూ రాజకీయాన్ని రగిలిస్తున్నారు. రాబోయే రోజుల్లో జనంలోనే ఉంటూ ప్రచారాలు చేసుకుంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఢోకా ఉండబోదని వీరిద్దరూ అంచనా వేసుకుంటున్నారు. కేంద్రం మనసులో ఏముందో తెలియక వీరిద్దరూ జనంలోనే ఉండటమే మంచిదని భావిస్తున్నారు.

ముందస్తు సంకేతమేనా ?
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నిర్వహణ కోసం ఇప్పటికే రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఇతర భాగస్వాములు కూడా తమ అభిప్రాయాలు చెప్పేశారు. ఇక మిగిలింది కేంద్రం తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయమే. కాబట్టి ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న సంకేతాలతో ఏపీలో రాజకీయ నేతలు అప్రమత్తమవుతున్నారు. ముందస్తు పేరెత్తకుండానే జగన్ రంగంలోకి దూకేస్తే.. చంద్రబాబు వంటి నేతలు ముందస్తుకు క్యాడర్ ను సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ, జనసేన మాత్రం కేంద్రం నుంచి సంకేతమేదైనా అందుతుందా అని ఎదురుచూస్తున్నాయి.












Click it and Unblock the Notifications