బీజేపీపై ఎదురుదాడి-వైసీపీ సరే.. టీడీపీ ఎందుకు ? అసలు కారణమిదేనా ?
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో చంద్రబాబుతో అమిత్ షా భేటీ, అనంతరం ఏపీకి వచ్చి వైసీపీ సర్కార్ పై, సీఎం జగన్ పై చేసిన విమర్శల తర్వాత పరిస్ధితుల్లో చాలా మార్పు కనిపిస్తోంది. ఆ తర్వాత రోజు నుంచే వైసీపీ నేతలు, మంత్రులు బీజేపీపై ఎదురుదాడి మొదలుపెట్టేశారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అదే సమయంలో ఇన్నాళ్లూ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడిన విపక్ష టీడీపీ కూడా ఆ పార్టీని టార్గెట్ చేస్తోంది.
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా రాజకీయం మారిపోయిన నేపథ్యంలో బీజేపీకి స్పేస్ కరవవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును పిలిపించుకుని మాట్లాడిన అమిత్ షా, అనంతరం ఏపీకి వచ్చి వైసీపీపై విమర్శలు చేశారు. దీంతో వైసీపీ సర్కార్ తో కేంద్రం సాధారణ సంబంధాలు కొనసాగిస్తూనే ఎన్నికల వేళ తన రాజకీయం చూసుకుంటోందని అంతా భావించారు. కానీ అమిత్ షా విమర్శల్ని స్వాగతించాల్సిన టీడీపీ .. దాని కంటే ఎక్కువగా కౌంటర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి.

అమిత్ షా, జేపీ నడ్డా వైసీపీ సర్కార్ పై చేసిన విమర్శల్ని నిశితంగా గమనిస్తే ఇరు పార్టీలకూ చెడిందనే భావన కలగడం సహజం. కానీ ఆ తర్వాత టీడీపీ స్పందన చూస్తుంటే ఈ రెండు పార్టీలు కుమ్మక్కై పైకి విమర్శలు చేసుకుంటున్నాయనే అనుమానంతో ఉన్నట్లు అర్ధమవుతోంది. అందుకే టీడీపీ.. బీజేపీతో పొత్తు కోసం ఓవైపు ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు జగన్ సర్కార్ పై చర్యలు తీసుకుని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ కాషాయ పార్టీని డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేపీని టీడీపీ నమ్మట్లేదని తేలిపోయింది.
గతంలో బెంగాల్,తెలంగాణలో అప్పటికే విపక్షాలుగా ఉన్న పార్టీల కంటే ఎక్కువగా అధికార పక్షాల్ని టార్గెట్ చేసి అసలైన విపక్షంగా మారిన బీజేపీ.. ఇప్పుడు ఏపీలోనూ అదే వ్యూహం అమలుచేస్తున్నట్లు ఇక్కడి విపక్షాలు కూడా అనుమానిస్తున్నాయి. రేపు వైసీపీని బీజేపీ మరింతగా టార్గెట్ చేస్తే ఇన్నాళ్లూ తాము చేసిన పోరాటం ఫలితం దక్కేలా లేదనే భావన ముఖ్యంగా టీడీపీలో కనిపిస్తోంది. అందుకే వైసీపీపై విమర్శలు కాదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేపీ ఇరుకునపడుతోంది.












Click it and Unblock the Notifications