Chandrababu: "1995 నాటి చంద్రబాబు"-సాధ్యమయ్యే పనేనా ? అప్పట్లో ఏం జరిగింది ?
ఏపీలో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఈ రెండు నెలల్లోనే తన 1995 నాటి పాలన తిరిగి తెస్తానంటూ పదే పదే చెప్తున్నారు. రాష్ట్రం గత ఐదేళ్లుగా అన్ని విధాలుగా నష్టపోయిందని, దాన్ని పునర్ నిర్మించాలంటే ఇది తప్పదని చెప్పేస్తున్నారు. ఇందుకు సిద్ధం కావాలంటూ ఉద్యోగుల్ని కోరుతున్నారు. తాజాగా నిన్నటి కలెక్టర్ల భేటీలోనూ చంద్రబాబు ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. దీంతో కలెక్టర్లు కూడా ఆలోచనలో పడ్డారు.
ఇంతకీ 1995లో ఏం జరిగిందో ఓసారి గమనిస్తే.. అప్పట్లో ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్న చంద్రబాబు తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాదు తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రతీ అంశంలోనూ తనదైన మార్క్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఎవరినీ నమ్మని నైజం అప్పట్లో చంద్రబాబుకు ఉండేదని కూడా చెప్తారు. దీంతో తన చుట్టూ ఉన్న అధికారులతో పాటు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల్ని సైతం గ్రిప్ లో ఉంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించే వారు.

ముఖ్యంగా చంద్రబాబు రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు పెట్టేవారు. హైదరాబాద్ లో బయలుదేరి ఎక్కడికి వెళ్తారో ముందుగా చెప్పకుండా ఆకస్మికంగా హెలికాఫ్టర్ లో బయలుదేరి రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వాలిపోయేవారు. ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేపట్టేవారు. ఏదైనా తేడా కనిపిస్తే అక్కడే సస్పెన్షన్, డిస్మిస్ ఉత్తర్వులు సిద్ధమైపోయేవి. ఈ ఆకస్మిక తనిఖీలు తనతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు చేసేలా ఆదేశాలు ఇచ్చేవారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగులంతా హడలిపోయేవారు. ఇది ఓ రకంగా 1999లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి పనికొచ్చినా అంతిమంగా 2004 నాటికి టీడీపీకి నష్టమే చేసింది.
ఇప్పుడు గత వైసీపీ పాలనలో అధికారులు ప్రభుత్వం, పార్టీ నేతలు చెప్పినట్లు వినడానికి అలవాటు పడిపోయారు. వీళ్లను తిరిగి బిజినెస్ రూల్స్ ప్రకారం పనిచేయించడం కష్టంగా మారిన పరిస్ధితుల్లో చంద్రబాబు 1995 పాలన మంత్రాన్ని బయటికి తీశారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఉద్యోగుల వైఖరిలోనూ చాలా మార్పు వచ్చింది. అలాగే చంద్రబాబుకు కూడా వయసు మీద పడింది. ఈ నేపథ్యంలో 1995 నాటి చంద్రబాబు అనే మాట పైపైన ఉద్యోగులను దారికి తెచ్చుకునేందుకు పనికొస్తుందే తప్ప ఆచరణలో సాధ్యం కాకపోవచ్చనేది విశ్లేషకుల మాట.












Click it and Unblock the Notifications