ఎప్పుడేం చేయాలో పవన్ కళ్యాణ్‌కు తెల్సు: జగన్ వైపు బిజెపి అడుగు?
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజన్ ఉన్న నాయకుడని, భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పొత్తుపై తాము ఇప్పుడే చెప్పలేమని బిజెపి నేత సోము వీర్రాజు సోమవారం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు షాక్ అని చెప్పవచ్చు. అయితే, ప్రస్తుతానికి బిజెపి, టిడిపి మధ్య బాగానే ఉందని చెప్పారు. కానీ మరింత సమన్వయం అవసరమని చెప్పారు.
టిడిపితో ప్రయాణం కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను తాను పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లడంపై మాట్లాడుతూ... ఆయనను తీసుకెళ్లినంత మాత్రానే నేను ఏదో పెద్దవాడిని కాదని, కేవలం మధ్యవర్తిగా తీసుకెళ్లానని చెప్పారు. పవన్ విజన్ ఉన్న నాయకుడని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌తో కలిగిన స్నేహంలో తాను ఆయనలో కొన్ని కోణాలు చూశానని చెప్పారు. ఆయకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని, ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసునని చెప్పారు. మోడీ ప్రధాని కావాలని ఆయన అనుకున్నారని చెప్పారు.
పార్టీ గురించి మాట్లాడుతూ... ప్రధాని మోడీ మీద గ్రామస్థాయి వరకు అభిమానం ఉందని, వ్యతిరేకత మాత్రం లేదన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అనే వారికి, పార్లమెంటు పైన దాడి చేసిన వారికి జిందాబాద్ అని చెప్పడం దేశంలో అభద్రతకు నిదర్శనమన్నారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీల తీరు దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.
టిడిపి, బిజెపి పార్టీల మధ్య మరింత సమన్వయం అవసరమని చెప్పారు. ఏపీ పైన కేంద్రం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చెప్పారు. నరేంద్ర మోడీ - చంద్రబాబు నాయుడు - పవన్ కళ్యాణ్ జోడీ వల్ల ప్రజలు గెలిపించారని చెప్పారు. పాలిటిక్స్ క్రికెట్ వంటిదన్నారు. ఓ బంతి వేస్తే క్రికెట్లో గెలుపు మారుతుందని, రాజకీయాలు అంతే అన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు టిడిపిని పొగుడుతున్నారని, సోము వీర్రాజు విమర్శిస్తున్నారని వస్తున్న వ్యాఖ్యల పైన ఆయన స్పందించారు. వెంకయ్య, తన మధ్య విభిన్న దృక్ఫథం లేదన్నారు. నిధులు తెచ్చుకుంటున్నాడని వెంకయ్య చెబుతుంటే, ఇస్తున్న నిధుల్లో కేంద్రానికి క్రెడిట్ ఇవ్వడం లేదని చెబుతున్నానన్నారు.
కేంద్రం నుంచి పదహారు వందల కోట్లకు పైగా వచ్చాయని చెప్పారు. ఆ లెక్కలన్నీ చెబుతామన్నారు. వెంకయ్యకు, తనకు మధ్య ఎలాంటి విభేదాల్లేవన్నారు. తామంతా భారత్ మాతాకీ జై అనే వాళ్లమన్నారు. తాను పలువురు నేతలను తీసుకు వచ్చానని చెప్పారు.
కృష్ణంరాజును కాకినాడకు తీసుకు వచ్చి ఎంపీ సీటు నుంచి పోటీ చేయించింది తానే అని చెప్పారు. తాను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తాను సీట్లు అమ్ముకుంటాననే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తనకు పదవి రాకుండా ఎవరో అడ్డుపడ్డారని తాను భావించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications