ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల మీద కరోనా ఎఫెక్ట్ ఉంటుందా ? ఎన్నికలు వాయిదా పడతాయా ?
కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల మీద కరోనా ఎఫెక్ట్ చూపిస్తుంది . కరోనా ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దేశంలో ఇప్పటి వరకు 84 కేసులు నమోదుకాగా, తెలంగాణలో ఒకటి, ఏపీలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఏపీలో కరోనా నివారణకు తీవ్రమైన తక్షణ చర్యలు అమలు చేస్తున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. అటు తిరుమలలో కూడా హైఅలర్ట్ ప్రకటించింది.

స్థానిక ఎన్నికలకు కరోనా ప్రభావం ఉందా ?
అయితే ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనాను మించి కలకలం రేపుతున్నాయి. ఈనెల 21 నుంచి ఏపిలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఒకపక్క కరోనా, మరో పక్క ఏపీలో నెలకొన్న దాడులు, దౌర్జన్యాల నేపధ్యంలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అన్న డౌట్ అందరిలో కలుగుతోంది. ఇక కరోనా వ్యాప్తి చెందకుండా గుంపులు గుంపులుగా జనాలు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే . ఇక ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.

ఎన్నికలు వాయిదా వెయ్యాలని ఈసీని కోరిన టీడీపీ
ఇక మరోపక్క తెలుగుదేశం పార్టీ ఎన్నికల విషయంలో ఎన్నికల కమీషన్ కు లేఖ రాసింది. ఏపీలో తాజా పరిస్థితుల నేపధ్యంలో ఎన్నికలను పోస్ట్ పోన్ చెయ్యాలని కోరింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని, అంతేకాకుండా రాష్ట్రంలో ఒక పాజిటివ్ కేసు నమోదైందని, ప్రాణం కంటే ఎన్నికలు ముఖ్యం కాదని పేర్కొన్నారు టీడీపీ నేతలు . ఎన్నికలను వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల కమీషన్ నిర్ణయం పై ఉత్కంఠ
అంతేకాదు ఏపీలో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు కొనసాగుతున్నాయని, నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని, రీ నోటిఫికేషన్ ఇచ్చి తరువాత ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్న పరిస్థితి సైతం ఉంది. మరి దీన్ని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. అయితే ఏపీ సర్కార్ మాత్రం ఏం జరిగినా సరే ఎన్నికలు జరిగే తీరాలనే సంకల్పంతో ఉంది. ఇప్పటికే చాలా స్థానాలలో ఏకగ్రీవం చేసుకున్న జోష్ లో ఉంది.












Click it and Unblock the Notifications