ఒకే వేదికపైకి సోనియా, రాహుల్, విజయమ్మ ? వైఎస్సార్ జయంతిపై ఉత్కంఠ...!
ఏపీలో ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ, వైఎస్సార్ మరణం తర్వాత ఆ పార్టీతో విభేదించి వేరు కుంపటి పెట్టుకుని అదే పార్టీని నామరూపాల్లేకుండా చేసేసిన వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇప్పుడు తండ్రి వైఎస్సార్ జయంతి వేడుకలకు సిద్ధమవుతున్నవారు. అంతే కాదు ఒకప్పుడు తన సోదరుడు వైఎస్ జగన్ ను, తల్లి విజయమ్మను అవమానించి పంపిన కాంగ్రెస్ పెద్దలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దీంతో విజయమ్మ ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలతో వేదిక పంచుకోవాల్సిన పరిస్ధితి.
ఈ నెల 8న వైఎస్సార్ జయంతి వేడుకలను విజయవాడలో అట్టహాసంగా నిర్వహించేందుకు వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. అయితే పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఉంటూ దీన్ని తన సొంత కార్యక్రమంలా నిర్వహిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న షర్మిల.. ఇవేవీ పట్టించుకోకుండా సోనియా, రాహుల్, సిద్ధరామయ్య, ఖర్గే సహా కాంగ్రెస్ పెద్దలందరినీ దీనికి ఆహ్వానించారు. వైఎస్సార్ బిడ్డగా తాను చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి ఊపిరిలూదేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మార్క్ ఇక్కడ కనిపించడం లేదు.

అయితే ఇదే వేదికపై కాంగ్రెస్ పెద్దలతో కలిసి చాలా కాలం తర్వాత షర్మిల తల్లి విజయమ్మ కనిపించబోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ తో విభేదించిన తన బిడ్డ వైఎస్ జగన్ తో కలిసి వేరు కుంపటి పెట్టేసిన విజయమ్మ.. అనంతరం కాంగ్రెస్ తన కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిందని పలు మార్లు విమర్శలు చేసారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలతో వేదిక పంచుకునేందుకు సిద్ధమవుతున్నవారు. తన బిడ్డ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో విజయమ్మకు ఈ అనివార్య పరిస్ధితి ఏర్పడుతోంది.
అయితే సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ పెద్దల్లో ఎంత మంది ఈ కార్యక్రమానికి వస్తారో తెలియదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన నేతలు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు సోదరుడు వైఎస్ జగన్ ను కూడా షర్మిల ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. దీంతో 8న జరిగే వైఎస్సార్ జయంతిలో ఎవరెవరు పాల్గొంటారు, ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications