వ్యక్తితో ప్రేమాయణం: ఆ మహిళది హత్యా, ఆత్మహత్యా?
అనంతపురం: ఓ మహిళ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం మండలంలోని సంతేబిదనూరు గ్రామంలో ఆర్తి (27) అనే మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఆమె ఉరివేసుకున్న తీరును గమనిస్తే ఇది ఆత్మహత్య కాకపోవచ్చు, హత్య కావచ్చుననే అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాళ్లు నేలకు ఆని ఉన్నాయి, మెడకు ఉరి ఉంది. అలా ఎలా ఉరిపడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంతేబిదనూరుకు చెందిన హనుమంతరాయప్ప, ఈశ్వరమ్మల కుమార్తె ఆర్తి (27)కి మడకశిరకు చెందిన వ్యక్తితో 8ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భర్త, పిల్లలు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమె రెండేళ్ల క్రితం పుట్టింటికి వచ్చింది.

ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన గంగాధరతో ప్రేమాయణం నడిచింది. అయితే కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానని గంగాధర్ ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. కానీ కొద్ది రోజుల తరువాత పెళ్లి చేసుకోకుండానే తిరిగి వచ్చేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
రూరల్ పోలీసులు గంగాధర్‌పై గత నెల 24న కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఆర్తి ఇంటిలో పైకప్పుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉండగా తన కుమార్తె మరణానికి గ్రామానికి చెందిన కొందరు పెద్ద మనుషులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు రూరల్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని రూరల్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications