ప్రియుడితో భర్తను చంపించిన స్త్రీ, శవం వెలికితీత

వివరాలు ఇలా ఉన్నాయి - కర్నూలు జిల్లా అస్పరికి చెందిన గిట్టప్పగారి రామాంజనేయులు, సుంకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. చిన్నవాడైన మునిరాజు (23)కు మూడేళ్ల క్రితం పత్తికొండకు చెందిన రామాంజనేయులు, పార్వతమ్మ దంపతుల చిన్న కూతురు భారతితో వివాహం జరిగింది. ఆ తర్వాత వేరు కాపురం పెట్టి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. భారతి అక్క తిరుపతమ్మ అస్పరి సమీపంలోని మొలగువళ్లిలో ఉంటోంది.
ఆమె భర్త వేమన్న తరుచుగా అస్పరిలోని మరదలు భారతి ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వైవాహికేతర సంబంధం ఏర్పడింది. చివరకు వీరిద్దరూ మునిరాజును వదిలించుకోవాలని నిర్ణయించుకుని హత్య చేసినట్లు సమాచారం.
ఈ నెల 9వ తేదీన అస్పరి చౌరస్తాలో ఉన్న తన బావను ఇంటికి తీసుకురావాలని భారతి తన భర్తకు చెప్పింది. దాంతో బయటకు వెళ్లిన మునిరాజు తిరిగి రాలేదు. దీంతో మునిరాజు తల్లిదండ్రులు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్నారు.
భార్యపై మునిరాజు బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు నాలుగు రోజుల క్రితం ఆమె బావను అదుపులోకి తీసుకుని విచారించారు. మునిరాజును ఆదోని సమీపంలోని సాదాపురం బస్టాండు వద్ద హత్య చేసి పూడ్చిపెట్టినట్లు అతను చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు భారతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
దాంతో సోమవారంనాడు మునిరాజు బంధువులు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో చివరకు పూడ్చిపెట్టిన శవాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్రం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications