ప్రియుడి మోజులో పడి పక్కా ప్లాన్‌తో భర్తను కడతేర్చింది: కానీ, ఇలా దొరికిపోయింది
తూర్పుగోదావరి: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ దుర్మార్గురాలు. మొదట నాటకం ఆడినప్పటికీ పోలీసుల దర్యాప్తులో అసలు నిజం తేలింది. రంపచోడవరం మండలం ఐ.పోలవరం అటవీ ప్రాంతంలో జులై 26న రాజమహేంద్రవరంలోని హుకుంపేటకు చెందిన వడ్డి ఇమ్మానుయేలు అనుమానాస్పాదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.
అతడి అడ్డు తొలగించుకునేందుకు భార్యే ప్రియుడితో కలిసి హత్యచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ జె విజయబాబులు ఆ కేసు వివరాలను వెల్లడించారు.

భర్త స్నేహితుడు వివాహేతర సంబంధం
హుకుంపేటకు చెందిన వడ్డి ఇమ్మానుయేలు తాపీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అతడికి భార్య దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు ఇమ్మానుయేలు, పిడింగొయ్యికి చెందిన గండ్రోతు శివకుమార్ అలియాస్ శివ స్నేహితులు. అతడూ తాపీపని చేస్తుంటాడు. ఇమ్మానుయేలు భార్య దేవి సమీపంలోని పాఠశాలకు ఇద్దరు పిల్లలను రోజూ తీసుకెళ్లే క్రమంలో ఆమెతో శివ పరిచయం పెంచుకున్నాడు.
అనంతరం వారిద్దరి(దేవి, శివ) మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లుగా ఇమ్మానుయేలు మద్యం తాగి భార్యను వేధిస్తుండేవాడు. దీంతో ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని భావించిన భార్య దేవి ప్రియుడు శివతో కలిసి పథకం రచించింది.

ప్రియుడితో కలిసి పథకం..
రంపచోడవరం సమీపంలోని సీతపల్లిలో గడిబాపనమ్మతల్లి ఆలయానికి వెళ్దామని ఇమ్మానుయేలును శివ కోరాడు. అతడు దానికి అంగీకరించడంతో ఇద్దరూ జులై 26వ తేదీ మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. దేవిని వెనుక బస్సులో రావాలని ప్రియుడు శివ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె సైతం బయలుదేరింది. స్నేహితులిద్దరూ గోకవరంలోని ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేశారు. అక్కడి నుంచి సీతపల్లి వచ్చి సమీపంలోని పోలవరం ప్రాంతంలో ఇద్దరూ మద్యం తాగారు.

చున్నీతో ఉరివేసి చంపేశారు
ఇమ్మానుయేలుతో ఎక్కువగా మద్యం తాగించడంతో అతడు మత్తులోకి జారుకున్నాడు. ఇంతలో అక్కడికి అతడి భార్య దేవి చేరుకుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ఆమెను ప్రశ్నించి ఘర్షణ పడ్డాడు. ఆమెపై దాడి చేసి కొట్టడంతో శివ, దేవి కలిసి చున్నీతో ఇమ్మానుయేలు పీకనొక్కి హతమార్చారు. ఆధారాలు లేకుండా చేసేందుకు వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి కాల్చివేశారు.

ఇలా పట్టేశారు
అయితే, సెల్‌ఫోన్‌లో సిమ్ తీసి అక్కడే పారేశారు. అనంతరం అక్కడే లభించిన సెల్ ఫోన్, తాగిన మద్యం సీసాపై ఉన్న నంబరు ఆధారంగా ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. మద్యం దుకాణం వద్ద సీసీ పుటేజీ పరిశీలించి నిందితుడిని గుర్తించారు. సెల్‌ఫోన్‌లో శివ నంబరు ఉండటంతో ఫోన్ చేసి పోలవరం ప్రాజెక్టు పనుల వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా, తండ్రి హత్యకు గురికావడం, తల్లిని పోలీసులు అరెస్టు చేయడంతో వారి పిల్లలు ఇద్దరూ అనాథలయ్యారు.