ప్రచారం అవసరంలేదు, మోడీ పర్మినెంట్: చంద్రబాబు తమవిగా చెప్పుకోవడంపై కేంద్రమంత్రి
కడప: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కాకపోయినా రేపన్నా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే శనివారం ధీమా వ్యక్తం చేశారు. ఆయన కడపలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం తన సొంత పథకాల్లా ప్రచారం చేసుకుంటోందని కొందరు రాష్ట్ర నేతలు వాపోయారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ... ప్రజాసేవ కోసం ప్రచారాలు అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోడీని పర్మినెంట్ ప్రధానిగా పేర్కొన్నారు.
మోడీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో ఒక్క డాలర్‌తో తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీల కంటే మన రూపాయి విలువ పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నగదురహిత లావాదేవీల కోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపీపీబీ) పథకం అమల్లోకి తెచ్చామన్నారు.

కాగా, అంతకుముందు, కేంద్రమంత్రి పర్యటనలో గందరగోళం చెలరేగింది. విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా కడపలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు కేంద్రమంత్రి కారును అడ్డుకున్నారు.
కడపలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి మధ్యాహ్నం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి బయలుదేరిన కేంద్రమంత్రి వాహనాన్ని భవనం బయటికి రాగానే అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు నిరసనకారులను వాహనాలలో స్టేషన్‌కు తరలించారు.
దీంతో మరో రాష్ట్రీయ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు తస్లీం కేంద్రమంత్రి వాహనంపై బూట విసిరారు. కారు అప్పటికే వెళ్లిపోవడంతో బూటు కారు సమీపంలో పడింది. ఉక్కు పరిశ్రమ కోసం 360 రోజులు దీక్షలు చేశామని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా, బీజేపీ మంత్రులు జిల్లా పర్యటనలు ఎలా చేస్తారని ఆ పార్టీ నాయకులు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications