పవన్ కళ్యాణ్ అనుమానం: అవసరం లేదని యనమల, జగన్‌పై ఆగ్రహం
అమరావతి: పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం నాడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని చెప్పారు.
ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హోమియోపతి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు.

జగన్ గురించి ఆలోచించాలి
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చే హామీలు ఎంతమేరకు నెరవేరుస్తాడోనని యనమల ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు. తద్వారా జగన్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు.

గడ్కరీతో భేటీ అయ్యాక
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు నాయుడు చర్చల తర్వాత కాంట్రాక్టర్‌కు నెల గడువు ఇచ్చినట్లు యనమల తెలిపారు. కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ ఈ గడువులోగా నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని అన్నారు. లేదంటే కాంట్రాక్టర్‌ను మారుస్తామని చెప్పారు.

నిధుల కొరత లేదు
పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని యనమల స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతాయని అభిప్రాయపడ్డారు.

జగన్, పవన్ అనుమానాలు
కాగా, పోలవరం ప్రాజెక్టుపై విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలవరం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారా అని వాళ్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications