నేను చేసిన తప్పేంటో చెప్పు: సీఎం జగన్ కు వైసీపీ ఎమ్మెల్యే నిలదీత!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గాల ఇంచార్జీల మార్పు వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తికి, అసహనానికి కారణంగా మారుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పక్క పార్టీల వంక చూస్తూ జంపింగ్ కు రెడీ అయ్యారు. సీఎం జగన్ తీరుపై బాహాటంగానే విముఖత ప్రదర్శిస్తున్నారు. ఇక తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తనకు టికెట్ రాదని తేలటంతో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తానుచేసిన తప్పేంటో చెప్పాలని ఆయన జగన్ ను నిలదీశారు. ఐదేళ్ళ కాలంలో ఎప్పుడైనా జగన్ మమ్మల్ని పిలిచి మాట్లాడారా చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. జగన్ చెప్పిందే తాను చేశానని ఇప్పుడు నా తప్పంటే ఎలా అంటూ ప్రశ్నించారు.

గతే ఐదేళ్ళుగా పార్టీ పెద్దలు, జిల్లా మంత్రులు చెప్పిన మేరకే నడుచుకున్నా అని, ఇప్పుడు తనపై వ్యతిరేఖత ఉందంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఐ ప్యాక్ సర్వేలో తనపై వ్యతిరేఖత ఉందని, ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పటం ఏ మాత్రం తగదన్నారు. గతంలో ఐ ప్యాక్ సర్వేతోనే తనకు టికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు.
డబ్బులిస్తే ఐ ప్యాక్ వారు సర్వే రిపోర్టు ఎలాగైనా మారుస్తారన్నారు. ఇంకా సీఎం జగన్ పై తనకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు. వైసీపీపై నమ్మకంతోనే ఇంకా ఉన్నానన్న ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. పూతలపట్టు టికెట్ విషయంలో పునరాలోచించాలని అభ్యర్థించారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాలలో ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఓసీలపై వ్యతిరేఖత ఉన్నా వారి సీట్లు మార్చటం లేదని, కేవలం ఎస్సీ లనే టార్గెట్ చేశారని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తనకు న్యాయం చేస్తారని నమ్ముతున్నానని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications