Year Ender 2022 : ఏపీలో మారిన పొలిటికల్ సీన్-అటు మైనస్-ఇటు మాత్రం ప్లస్ కావట్లేదా ?
ఏపీలో 2019 ఎన్నికల తర్వాత మారిన పరిస్ధితుల్లో రాష్ట్రంలో బలపడుతూ వస్తున్న వైసీపీ 2024 ఎన్నికల్లోనూ అదే ఫీట్ రిపీట్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో విపక్షాలు రోజుకో వ్యూహంతో జగన్ ను ఇరుకునపెట్టి రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నంలో ఈ ఏడాది
ఎవరు పైచేయి సాధించారు, ఎవరు విఫలమయ్యారనే అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అదే సమయంలో మూడేళ్లుగా ఏకపక్షంగా, చప్పగా సాగిపోతున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఏడాది పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.

ఏపీలో మారిన రాజకీయ ముఖచిత్రం
ఏపీలో ఈ ఏడాది రాజకీయ ముఖచిత్రంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఓవైపు మూడేళ్ల పాలన పూర్తి చేసుకని నాలుగో ఏడాదిలో కొనసాగుతున్న వైసీపీ సర్కార్.. మరోసారి ప్రజల మద్దతు కోరేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు వైసీపీని తిరిగి అధికారంలోకి రానివ్వకుండా చూసేందుకు విపక్షాలు పలు త్యాగాలకు కూడా సిద్దమవుతున్న పరిస్ధితి. ముఖ్యంగా పరస్పరం పైచేయి సాధించేందుకు వైసీపీ, విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలతో రాష్ట్రంలో హింస కూడా పెరుగుతోంది. కేసుల సంఖ్యా ఎక్కువవుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాన్ని మరోసారి తమ చేతుల్లోకి తెచ్చుకునేందుకు ప్రధాన పార్టీలు శ్రమించాల్సి వస్తోంది.

వైసీపీకి మిశ్రమ ఫలితాలు
ఈ ఏడాదిలో అధికార వైసీపీకి మిశ్రమ ఫలితాలు లభించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు భారీ ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నా అభివృద్ధి విషయంలో అదే వెనుకబాటు ఈ ఏడాది కూడా కొనసాగింది. పదుల సంఖ్యలో అభివృద్ధి పనులకు శంఖుస్ధాపనలు చేస్తున్నా వాటిలో ఏ ఒక్కటీ ఇప్పట్లో ప్రారంభించే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో పోర్టులన్నీ అదానీ పరం అవుతుండగా, విభజనసమయంలో హామీ ఇచ్చిన పోలవరం వంటి ప్రాజెక్టులకు సైతం ఈ ఏడాది కూడా మోక్షం కలగలేదు. అటు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి వాటిని ప్రైవేటు పరం కాకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్నా అవి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ఆరంభంలో ఉన్న ఊపు ఇప్పుడు కనిపించడం లేదు. దీన్ని గమనించిన జగన్ కొత్త కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు.

టీడీపీ మెరుగుపడినా..
రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా ఉన్న టీడీపీ ఈ ఏడాది కాస్త మెరుగుపడింది. గత మూడేళ్లలో రెండేళ్లు కరోనా కారణంగా నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే బయటికొస్తే వైసీపీ నేతలు కేసులు పెడతారన్న భయంతో టీడీపీ నేతలు జనంలోకి రావడానికి భయపడ్డారు. చివరికి ఎన్నికలు సమీపిస్తుండటం, చంద్రబాబు హెచ్చరికలతో నేతలు జనంలో తిరగడం మొదలుపెట్టారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తిరుగుతున్న స్ధాయిలో టీడీపీ నేతలు ఈ మూడేళ్లలో కనిపించలేదు. అలాగే ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో టీడీపీ జనంలోకి వెళ్తున్నా పూర్తి స్దాయిలో ఫలితాలు మాత్రం లభించడం లేదు. దీంతో కొత్త ఏడాదిలో లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో జనం నుంచి స్పందన వస్తున్నా దాన్ని ఓట్ల రూపంలోకి మలుచుకోవడంలో టీడీపీ సామర్ధ్యంపైనే వచ్చేఎన్నికల ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది.

పుంజుకున్న పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో ఈ ఏడాది అధికార వైసీపీకి గట్టిపోటీ ఇవ్వడంలో చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ చాలా సార్లు ముందున్నట్లు కనిపించారు. అలాగే వైసీపీకి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు కంటే చాలా చోట్ల పవన్ కు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పలు చోట్ల మంచి ఫలితాలు అందించింది. అయితే గత టీడీపీ పాలనపై జనంలో ఉన్న వ్యతిరేకత ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో జనసేన కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తనదైన విధానాలతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది జగన్, చంద్రబాబుకు పోటీగా రాజకీయం నడపటంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో ప్రధాని మోడీ, చంద్రబాబు పవన్ కు ఇస్తున్న ప్రాధాన్యత జనసేనానికి భవిష్యత్తులో డిమాండ్ పెంచబోతోంది.

ఏపీలో వాస్తవ పరిస్ధితి ఇదీ.. !
ఏపీలో ఈ ఏడాది మారిన తాజా రాజకీయ చిత్రాన్ని చూసుకుంటే వైసీపీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తుండటం, సంక్షేమ పథకాలు పూర్తిస్దాయిలో అందించలేకపోవడం, నిధుల కొరత, అభివృద్ధికి వెనుకాడటం, ప్రత్యర్ధులపై కక్ష సాధింపు రాజకీయాలు వైసీపీని మైనస్ లోకి నెడుతున్నాయి. అయితే ఆ మేరకు దీన్ని సొమ్ము చేసుకోవడంలో మాత్రం చంద్రబాబు విఫలమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో టీడీపీ పాలనలోనూ దాదాపు ఇవే సీన్లు కనిపించడమే. అందుకే చంద్రబాబు కంటే పవన్ స్ధిరంగా, నిర్మాణాత్మకంగా రాజకీయాలు చేస్తే ఆయన్ను వచ్చే ఎన్నికలకు ప్రత్యామ్నాయంగా జనం పరిగణించే అవకాశాలు మెరుగుపడతాయనే చర్చ సాగుతోంది. లేకపోతే వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications