Year Ender 2025: తొలిసారి ఆ ముద్ర చెరిపేసుకున్న టీడీపీ..! ఈ ఏడాది ఇదే హైలెట్..!
ఏపీ రాజకీయాల్లో భిన్న ధృవాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీలకు ప్రజల్లో మాత్రం ఓ ముద్ర ఎప్పుడూ ఉంటుంది. అదే టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఎప్పుడూ అభివృద్ది హడావిడిలో మునిగిపోయి సంక్షేమాన్ని పక్కనబెట్టేస్తారని, అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ సంక్షేమాన్నే పట్టించుకుంటూ అభివృద్ధిలో వెనుకబడి ఉంటారని. అయితే ఈ ఏడాది అధికారంలో ఉన్న టీడీపీ తనపై ఉన్న సంక్షేమ వ్యతిరేకి ముద్రను దాదాపుగా పోగొట్టేసుకుంది.
గతంలో కాంగ్రెస్ తో పోటాపోటీ రాజకీయాలు చేసినప్పుడు కూడా టీడీపీకి అభివృద్ది ముద్ర మాత్రమే ఉండేది. సంక్షేమం గురించి ఆలోచించినా ఏదో నామమాత్రంగానే అన్నట్లు ఉండేది. అందుకే వైఎస్ హయాంలో ఆ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రెండుసార్లు ఆయన సీఎం కాగలిగారు. ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ కూడా చంద్రబాబు సంక్షేమ పథకాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే కారణం చూపి జనాన్ని ఓట్లు అడిగి 2019 ఎన్నికల్లో గెలిచారు.

దీంతో ఈసారి ఎలాగైనా సంక్షేమ వ్యతిరేకి ముద్ర పోగొట్టుకోవాలని అనుకున్నారో, లేక గతేడాది ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేయట్లేదని విపక్ష వైసీపీ జనంలోకి వెళ్లి ఆరోపణలు చేస్తుందని అనుకున్నారో కానీ చంద్రబాబు పూర్తిగా రూటు మార్చేశారు. అనుకున్నదే తడవుగా ఈ ఏడాది తల్లికి వందనంతో ప్రారంభించి అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకం, ఇంకా హామీ ఇవ్వని ఆటో డ్రైవర్లకు సేవలో పథకాన్ని కూడా అమలు చేసేశారు. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల్ని కూడా విడుదల చేశారు. తాజాగా అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల్ని సైతం జమ చేశారు.

దీంతో రాష్ట్రంలో టీడీపీ లేదా కూటమి సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదంటూ పదే పదే జనంలోకి వెళ్లిన వైసీపీకి ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆ అవకాశం లేకుండా పోయింది. అంతే కాదు టీడీపీ చరిత్రలో తొలిసారి సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి విమర్శలు లేకుండా మంచి మార్కులు సంపాదించుకుంది. సంక్షేమ వ్యతిరేకి ముద్రను పోగొట్టుకోవడంతో పాటు ఈ ఐదేళ్లలో సూపర్ సిక్స్ హామీల అమలుపై లబ్దిదారుల్లో భరోసా కల్పించింది. దీంతో ప్రజల్లోనూ ఈ ఏడాది మంచి ప్రభుత్వం అన్న ముద్ర కనిపిస్తోంది..












Click it and Unblock the Notifications