"చంద్రబాబూ.. మీరు భయపడుతున్నారు"- జగన్ సంచలన ట్వీట్..!
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో విఫలమై అబద్ధాలు చెబుతున్నారని, వాటిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. అంటే మీరు భయపడుతున్నారనే కదా దీని అర్థం అన్నారు. ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే మీ పరిపాలన బాగా లేదనే కదా అర్థం అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే కదా దాని అర్థం అన్నారు. మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారని అడగడం తప్పా? రెండేళ్లు అవుతున్నా, మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం నేరమా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? అని జగన్ ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా అన్నారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వస్తూనే ఇస్తామన్న ఐఆర్ ఇవ్వాలని అడగడంలో తప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే కదా. ఉద్యోగుల విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు, మీ మోసపూరిత వైఖరిని అందరూ గమనిస్తున్నారన్నారు.

సీఐ శంకరయ్య విషయంలోనూ ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారని, వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనీ కదా అర్థం అన్నారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని అడిగారు.

రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదన్నారు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు ఇది జంగిల్ రాజ్ కాదా? అని నిలదీశారు. ఉగాది రోజున మీ జీతాలు డబుల్ చేస్తామని వాలంటీర్లకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపుకొట్టింది నువ్వు కాదా? అన్నారు. 2.60 లక్షల మందిని రోడ్డున పడేసి, ఆ వ్యవస్థే లేకుండా చేసిన అరాచకత్వం నీదేకదా? అన్నారు. మీ కక్ష సాధింపులకు, మీరు ఉద్యోగులపై పెట్టే ఒత్తిడులకు ఒక్క సచివాలయ ఉద్యోగులే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు గారూ.. సూటిగా ఒక ప్రశ్న, మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా? అని నిలదీశారు. చంద్రబాబుగారూ.. మీరు తప్పు చేస్తున్నారు..అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు, భయపడుతున్నారని జగన్ ముగించారు.












Click it and Unblock the Notifications