ఎన్నికల ప్రక్రియ మొత్తం కబ్జా, రిగ్గింగ్ దే విజయం- జగన్..!!
స్థానిక ఎన్నికల నిర్వహణ పైన మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ కబ్జా చేసారని ఆరోపించారు. నామినేషన్ల పర్వం నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రతీ దశ లోనూ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల సంఘం.. పోలీసులు సైతం ప్రభుత్వాని కి మద్దతుగా నిలిచి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసారని వ్యాఖ్యానించారు. తాము న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. పోలింగ్ పూర్తయిన తరువాత ఓట్ల సంఖ్య ఎలా పెరిగిందని జగన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక చంద్రబాబు అక్రమాలు చేసారని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అక్రమాల ద్వారా సీఎం చంద్ర బాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. శకుని మాయా పాచికల్లా ఎన్నికల ప్రక్రియను రిగ్ చేశారని, అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ఎన్నికల వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, 143 హామీలపై ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని జగన్ ఆరోపించారు.

వేలాది మంది వసీపీ కార్యకర్తలను బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించారని, అరెస్టులు చేశారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలతో పోలీసులు కుమ్మక్కై తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని అన్నారు. స్క్రూటినీ పేరుతో పత్రాలు మాయం చేయడం, సంతకాలు ఫోర్జరీ చేయడం, నామినేషన్లను తిరస్కరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. నామినేషన్ల దశలోనే పోటీ లేకుండా చేశారని జగన్ ఆరోపించారు. పులివెందులలో 40 వార్డులకు గాను 20 వార్డుల్లో మాత్రమే తమ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారని పేర్కొన్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తరహా దౌర్జన్యం కొనసాగిందని, 84 జెడ్పీటీసీ, 2,109 ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్ల దశలోనే పోటీ లేకుండా చేశారని ఆరోపించారు. అభ్యర్థులను అరెస్టు చేయడం, పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నామినేషన్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని జగన్ ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో 11,378 పోలింగ్ కేంద్రాలకు గాను 5,737 కేంద్రాల్లో మాత్రమే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 31,460 కేంద్రాలకు గాను 16,064 కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నామినేషన్లు, స్క్రూటినీ, పోలింగ్ బూత్‌లు, పోలింగ్ శాతం, రాత్రిపూట బ్యాలెట్ బాక్సుల నిర్వహణ వరకు అన్ని దశల్లోనూ రిగ్గింగ్ జరిగిందని విమర్శించారు.పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకుండా సహకరించారని జగన్ ఆరోపించారు.














Click it and Unblock the Notifications
