చంద్రబాబు రాకపోవడం దారుణం: రైతులతో వైయస్ జగన్
కాకినాడ: భారీ వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన రైతుల వద్దకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకపోవడం దారుణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారంనాడు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం చినగొళ్లపాలెం చేరుకున్నారు.
ఆ గ్రామంలో ఆయన వరద బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత వర్షాలతో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. జిల్లాలో లక్షన్నర ఎకరాలకు పైగా పంట నష్టపోతే కేవలం 18 ఎకరాల పంట మాత్రమే నష్టపోయినట్లు అధికారులు చూపుతున్నారని జగన్ ఈ సందర్భంగా విమర్శించారు.

నష్టపోయిన చాలా మంది రైతుల వద్దకు అధికారులు వెళ్లడం లేదని ఆయన అన్నారు. గత తుఫానులో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని అన్నారు. అకాల వర్షాలతో ఎంత పంట నష్టం జరిగిందో తెలిసినప్పుడు రైతులకు ఒకే రకమైన పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని, అయితే అలా జరగడం లేదని అన్నారు. ఒకే రకంగా పరిహారం ఇవ్వకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన తప్పు పట్టారు.
తన వద్ద ఆవేదన వ్యక్తం చేసిన రైతులకు జగన్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ని విధాల రైతులకు అండగా ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications