వ్యూహం మార్చిన జగన్: 30న గవర్నర్‌తో భేటీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నారు. రాజకీయంగా తన జోరు పెంచారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి తమ పార్టీ శాసనసభ్యులు తమ రాజీనామాలను ఆమోదించుకోవాలే దిశగా కదిలిన జగన్ ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకున్నారు. దానికి బదులుగా శానససభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలనే డిమాండ్‌ను జగన్ ముందుకు తెచ్చారు.
రాష్ట్ర విభజనపై శాసనసభలో తీర్మానం ప్రతిపాదించే విషయంపై చర్చించేందుకు జగన్ గవర్నర్ నరసింహన్ అపాయింట్‌మెంట్ కోరారు. జగన్‌కు గవర్నర్ ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ గవర్నర్‌ను కోరనున్నారు.

తెలంగాణపై తీర్మానాన్ని పంపించడానికి ముందే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేస్తోంది. సమైక్య తీర్మానం కోసం శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని జగన్ గవర్నర్‌ను కోరనున్నారు. అసెంబ్లీలో తీర్మానం తర్వాత శాసనసభ్యులు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటారని అంటున్నారు.
రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలనే వైయస్సార్ కాంగ్రెసు వ్యూహంపై పెద్ద యెత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ తీర్మానం సభలో సజావుగా సాగిపోవడానికి వీలుగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని అనుకుంటున్నారని, కాంగ్రెసు అధిష్టానంతో కుమ్మక్కు కావడం వల్లనే తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో నెగ్గే వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారని విమర్శలు వచ్చాయి.
రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహాన్ని కాంగ్రెసు పార్టీకే చెందిన మంత్రి శైలజానాథ్ తప్పు పట్టారు. రాజీనామాలను ఆమోదింపజేసుకోవడమంటే విభజనకు కుట్ర చేయడమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు వైయస్సార్ కాంగ్రెసుపై దుమ్మెత్తిపోశాయి. శాసనసభ్యులు రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించేందుకు అది అవసరమని ఎపి ఎన్జీవోల అధ్యక్షుడు పి. అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఈ స్థితిలో జగన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు.
కాంగ్రెసుతో బెయిల్ కోసం కుమ్మక్కయ్యారనే ఇతర పార్టీల విమర్శలకు బలం చేకూరుతుందనే ఉద్దేశంతో శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదింపజేసుకునే కార్యాచరణకు స్వస్తి చెప్పారు. అందుకు ప్రత్యామ్నాయంగా శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం ప్రతిపాదించాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. సమైక్యాంధ్రకు తాము మాత్రమే కట్టుబడి ఉన్నామని ప్రకటించుకోవడానికి ఇది పనికి వస్తుందని జగన్ భావిస్తున్నారు. పార్టీ శాసనసభ్యుల్లో తెలంగాణకు చెందినవారెవరూ లేకపోవడం వల్ల అది జగన్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications