Rishabh Singh Sambyal: 'నేషనల్ క్రష్' మేజర్ షాకింగ్ డెసిషన్.. 12 ఏళ్ల సైనిక సేవకు గుడ్‌బై!
Rishabh Singh Sambyal: భారత సైన్యంలో విశిష్ట సేవలు అందించి, సోషల్ మీడియాలో 'నేషనల్ క్రష్'గా పేరుగాంచిన మేజర్ రిషబ్ సింగ్ సాంబ్యాల్ ఆర్మీ సర్వీస్ నుంచి ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. దాదాపు 12 ఏళ్ల పాటు సైనిక సేవల్లో కొనసాగిన ఆయన.. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏడీసీ(అసిస్టెంట్-డి-క్యాంప్)గా బాధ్యతలు నిర్వర్తించారు. పదవి నుంచి వైదొలిగిన అనంతరం ఆయన రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపదీ ముర్మును కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మార్గదర్శకత్వం, బోధనలు తన జీవితానికి ఎంతో ఉపయోగపడ్డాయని మేజర్ రిషబ్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.
ఎన్డీఏ నుంచి పారా స్పెషల్ ఫోర్సెస్ వరకు
మేజర్ రిషబ్ సింగ్ సాంబ్యాల్ సైనిక ప్రయాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగింది. 2013లో ఎన్‌డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షలో ఉత్తీర్ణులై 2014లో శిక్షణ ప్రారంభించిన ఆయన.. ఇండియన్ మిలిటరీ అకాడమీలో డిఫెన్స్ మేనేజ్మెంట్ విద్యను అభ్యసించారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 'జాట్ రెజిమెంట్' దళానికి కెప్టెన్ గా నాయకత్వం వహించి 'బెస్ట్ మార్చింగ్ కాంటింజెంట్' ట్రోఫీని గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆర్మీకి చెందిన అత్యంత కఠినమైన '4 పారా స్పెషల్ ఫోర్సెస్'లో పనిచేసి ప్రతిష్ఠాత్మకమైన 'బలిదాన్ బ్యాడ్జ్'ను కూడా సాధించారు.

రాష్ట్రపతి ఏడీసీగా సోషల్ మీడియా క్రేజ్
మార్చి 2023లో భారత రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికైన రిషబ్ సింగ్ సాంబ్యాల్ నాటి నుంచి ద్రౌపదీ ముర్ము అధికారిక కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు, పరేడల్లో ఆమె వెంట ఉంటూ ప్రోటోకాల్, భద్రతా వ్యవహారాలు చూసుకునేవారు. రాష్ట్రపతి పక్కన ఆయన కనిపించే తీరు, సైనిక క్రమశిక్షణ, హుందాతనం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయి, నెటిజన్లు ఆయనను 'నేషనల్ క్రష్'గా అభివర్ణించడం ప్రారంభించారు.
రిటైర్మెంట్‌కు గల కారణాలు
12 ఏళ్ల సర్వీస్ తర్వాత ఆయన ఆర్మీకి స్వస్తి చెప్పడంపై రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితుల దృష్ట్యా ముందుకు సాగాల్సి వచ్చిందని, ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనలు ఏవీ లేవని ఆయన ఓ సోషల్ మీడియా లైవ్ లో వెల్లడించారు. రిటైర్మెంట్ అనంతరం ఆయన తన తదుపరి కెరీర్ ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు.














Click it and Unblock the Notifications