జగన్‌కు ఉద్యోగం రాదు, బాబుకు అవసరం లేదు: ప్రత్యేక హోదాపై జగన్
కాకినాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చర్మం మందమెక్కిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాకినాడ యువభేరీ కార్యక్రమంలో ఓ యువతి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ బుధవారం ఆయన ఆ విధంగా అన్నారు. మనిషికో మాట, పశువుకో దెబ్బ అని అంటారని, చంద్రబాబును ఏమనాలో తెలియడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబుకు సిగ్గూ ఎగ్గూ ఏదీ లేదని ఆయన అన్నారు.
విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని ఆయన అన్నారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయని, అందులో యూనివర్శిటీ అధికారులు పాల్గొన్నారని, ఆ విధంగా రాజకీయ జోక్యం ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై విద్యార్థులను చైతన్యవంతులను చేస్తామని అంటే మాత్రం విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు వద్దని అంటున్నారని విమర్శించారు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన కేంద్ర మంత్రుల జోక్యం వల్లనే జరిగిందని ఆయన అన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై వచ్చిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ లోకేష్ పుట్టిన రోజు వేడుకల ఉదంతాన్ని ఫొటో చూపిస్తూ చెప్పారు.
అబద్ధాలు చెప్పినవారికి గట్టిగా లెంపకాయ కూడా తగలాలని జగన్ అన్నారు. సబ్జెక్టు మీద మనకు అవగాహన ఉంటే, మాట్లాడడానికి వీలుంటుందని ఆయన అన్నారు. సమాచారం తెలుసుకుంటే చంద్రబాబును, మంత్రులను అడగడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా అంటే ఏమిటనేది చెప్పానని ఆయన ఓ విద్యార్తిని ప్రశ్నకు సమధానంగా చెప్పారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారని ఆయన అన్నారు. ప్రధాని మాట ఇచ్చారని, ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయని, ఏకగ్రీవంగా మాట ఇచ్చారని ఆయన అన్నారు. ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని అడగాలని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా వల్ల జగన్‌కు ఏ ఉద్యోగం రాదని, ప్రత్యేక హోదా రాకపోతే తనకు తనలాంటి వాళ్లకు ఏమీ తేడా పడదని, ప్రజలందరికీ నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. జగన్ చెల్లెలకు, చంద్రబాబు పిల్లలకు ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు గానీ ప్రజలకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications