సుధీర్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్: 21 నుంచి షర్మిల యాత్ర
వరంగల్/నల్గొండ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. సుధీర్ కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.
కొంతసేపు సుధీర్ కుటుంబసభ్యులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. గత డిసెంబర్ 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధీర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.

షర్మిల యాత్రను జయప్రదం చేయండి: వైయస్సార్ కాంగ్రెస్
నల్గొండ: దివంగత సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక నల్గొండ జిల్లాలో మృతి చెందిన వైయస్సార్ అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు జనవరి 21 నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల చేపట్టనున్న యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు గట్టు శ్రీకాంత్ రెడ్డి, ఎర్నేని వెంకటరత్నంబాబు కోరారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు.
దివంగత నేత వైయస్ ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేశాయని అన్నారు. ఆయన అభిమానులుగా ఉండి మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల జనవరి 21నుంచి జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. ఈ పరామర్శ యాత్ర దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజుర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో కొనసాగుందని చెప్పారు.












Click it and Unblock the Notifications