ఎమ్మెల్యేలపై జగన్ తుది సమీక్ష ? 30-40 మంది పనితీరుపై అసంతృప్తి ! 14న తేల్చేస్తారా?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరోసారి రావాలంటే తప్పనిసరిగా క్షేత్రస్ధాయిలో జనంలో మమేకం కావాలని సీఎం జగన్ పదే పదే కోరుతున్నా ఎమ్మెల్యేల పనితీరులో మార్పు కనిపించడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు అయితే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని లెక్కచేసే పరిస్ధితి లేదు. దీంతో సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వారికి క్లాస్ పీకుతున్నారు.అయినా పరిస్ధితిలో మార్పు రావడం లేదు. దీంతో తాజా రిపోర్ట్ ప్రకారం పనితీరు దారుణంగా ఉన్న 30-40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు సీఎం జగన్ సమీక్ష ఏర్పాటు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేల నిర్లిప్తత
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటిపోయింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి. వీటిలో ఎలాగైనా నెగ్గేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.తమ ఎమ్మెల్యేలకు సానుకూల సంకేతాలు పంపేందుకు 175 సీట్ల టార్గెట్ కూడా నిర్దేశించారు. అయినా ఎమ్మెల్యేల పనితీరులో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికీ జనంతో మమేకం అయ్యేందుకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధం కావడం లేదు. ప్రభుత్వ పనితీరు చూసి జనం తమకు ఓటేయకపోతారా అన్న ధైర్యం వారిలో పెరిగిపోతోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల నిర్లిప్తత ఇప్పుడు సీఎం జగన్ ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలపై తాజా రిపోర్ట్ రెడీ
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 151 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి చేరిన నలుగురు ఎమ్మెల్యేలు, వీరు కాకుండా టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ ఇన్ ఛార్జ్ లు.. ఇలా 175 నియోజకవర్గాల్లో వీరంతా ఏం చేస్తున్నారనే దానిపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. వైసీపీకి ఈసారి కూడా వ్యూహాలు రచిస్తున్న ఐప్యాక్ ఈ నివేదికల్ని తయారు చేసి సీఎంకు పంపుతోంది. వీటి ఆధారంగానే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ కు మరో రిపోర్ట్ అందినట్లు తెలుస్తోంది.

30-40 మందిపై జగన్ అసంతృప్తి?
ఈసారి అందిన రిపోర్ట్ ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలలో 30-40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలుస్తోంది. దీంతో వైఎస్ జగన్ వీరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరంతా జగన్ నిర్దేశించిన విధంగా గడప గడపకూ తిరగడం లేదని, పార్టీ ఆదేశాల్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం అయ్యే విషయంలో ఆయా ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా ఎమ్మెల్యేల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.

తుది సమీక్షకు సిద్ధమైన జగన్?
వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందని వైఎస్ జగన్ బలంగా నమ్ముతున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకుంటున్నారా లేదా అనే దానిపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్న జగన్ తుది సమీక్షకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇదే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన జగన్.. ఎమ్మెల్యేలకు, మంత్రులకు క్లాసులు పీకారు. అయినా కొందరిలో మార్పు కనిపించడం లేదు. దీంతో ఈ నెల14న తుది సమీక్ష నిర్వహించేందుకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా ఈ 30-40 మందిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications