సెక్షన్ 8 ఎందుకొచ్చింది, ఏం చేద్దాం?: ఓటుకు నోటుపై జగన్ ఆరా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటుకు నోటు కేసు విషయమై పార్టీ నేతల వద్ద ఆరా తీశారు. జగన్ రెండు వారాల పాటు జెరూసలేం యాత్రకు వెళ్లి తిరిగి, ఆదివారం హైదరాబాద్ వచ్చారు.
ఈ నెల 13వ తేదీన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఆదివారం ఉదయం లోటస్ పాండుకు చేరుకున్నారు. తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసు గురించి ఆయన ఆరా తీశారని సమాచారం.
కేసులో పురోగతి ఏమిటని, హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలన్ని డిమాండ్ ఎందుకు తెరపైకి వచ్చిందని, దానిపై మనం ఏ దిశలో వెళ్తామని ఆయన పార్టీ నేతలతో చర్చించారని సమాచారం.

కాగా, ఓటుకు నోటు కేసులో నేడు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రేవంత్ రెడ్డి, ఉదయ సిన్హా, సెబాస్టియన్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది.
ఈ క్రమంలో వారిని ఏసీబీ కోర్టు ఎదుట ఏసీబీ అధికారులు హాజరు పర్చనున్నారు. కేసు కీలక దశలో ఉన్నందున మరో 14 రోజులు రిమాండ్ పొడిగించాలని కోర్టును ఏసీబీ కోరనుంది. ఇందుకు సంబంధించి ఏసీబీ మెమో కూడా దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేవంత్ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే స్టీఫెన్ సన్‌కు హైకోర్టులో షాక్ తగిలింది.












Click it and Unblock the Notifications