చంద్రబాబు బాటలో లోకేశ్: మోసం చేయడంలో పీహెచ్‌డీ చేశారని జగన్

అమరావతి: రాష్ట్రంలో కరువు బారిన పడిన రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు, అసలు రాష్ట్రంలో కరువే లేదని అంటున్నారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. రాయలసీమ ఆయకట్టుకు నీళ్లు అందించకపోవడానికి నిరసనగా శనివారం కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడతూ రైతులను మోసం చేయడంతో చంద్రబాబు పీహెచ్‌డీ తీసుకున్నారని విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రాజెక్టులను చూడండని అన్నారు. వైయస్ బతికున్నప్పుడు అవి ఏస్థాయిలో ఉండేవి, చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని అన్నారు.

2014లో గండికోట సభలో చంద్రబాబు మాట్లాడుతూ కనీసం 10 టీఎంసీలు 2015 ఖరీఫ్‌కి ఇస్తానని చెప్పాడని, కానీ 2016 కూడా అయిపోవస్తున్నా గండికోట ప్రాజెక్టు ముందుకు కదల్లేదని పేర్కొన్నారు. ఇంతవరకు ఆ ముంపు గ్రామాల సమస్యలు తీర్చలేదని ధ్వజమెత్తారు.

గండికోట ప్రాజెక్టులోకి నీళ్లు ముందు పెండింగ్ పనులు పూర్తిచేయాలయని జగన్ సూచించారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 80 శాతం పనులు జరిగితే, మిగిలిన 20 శాతం ఇంతవరకు పూర్తికాలేదని దుయ్యబట్టారు. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలకు పరిహారం కూడా ఇంత వరకు ఇవ్వలేదని మండిపడ్డారు.

ఇక తెలుగు గంగ విషయానికి వస్తే అందులో బ్రహ్మంసాగర్ అంతర్భాగమని, చంద్రబాబు ఎప్పుడు జిల్లాకు వచ్చినా అందులో 12 టీఎంసీల నీళ్లు ఉండేలా చూస్తామని చెపుతారని అన్నారు. ప్రాజెక్టు ఇప్పటికే కట్టి ఉన్నా.. రెండున్నరేళ్ల నుంచి చంద్రబాబు ఏం చేశారని చూస్తే, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు ఒక్కటంటే ఒక్క టీఎంసీ కూడా నీళ్లివ్వలేదని అన్నారు.

ఒకవైపు శ్రీశైలం నుంచి నీళ్లు పొంగి పొరలిపోతున్నా.. తర్వాత నాగార్జున సాగర్ నుంచి సముద్రంలోకి వెళ్లి 92 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా బ్రహ్మంసాగర్ మాత్రం చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇక్కడ 12 టీఎంసీలు పెట్టాలన్న ధ్యాసే చంద్రబాబుకు లేకుండా పోయిందని అన్నారు.

బుద్ధి ఉన్న ఎవరికైనా ఒకటి తెలుస్తుంది. వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్‌కు నీళ్లు రావాలి. అంటే, 0-20 కిలోమీటర్ల మధ్య కెనాల్ వీక్‌గా ఉంది, దానికి రిపేర్లు చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు నేను కూడా చంద్రబాబుకు, మంత్రులకు ఎన్నోసార్లు చెప్పానని కానీ ఇంతవరకు చంద్రబాబు ఆ రిపేర్ల గురించి పట్టించుకోలేదని వాపోయారు.

ఇలాంటి మనిషిని ఎక్కడ పెట్టాలని అడుగుతున్నా.. పిచ్చాసుపత్రిలో పెట్టాలా లేక బంగాళాఖాతంలో కలపాలా అని అడుగుతున్నానని అన్నారు. చంద్రబాబు నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం అయ్యాక వర్షాలు కూడా రాకుండా పోయాయని ఎద్దేవా చేశారు.

YS Jagan fires Chandrababu Over Farmers Problems in Kadapa District Dharna

రాయలసీమకు కరెంట్‌ని అందిస్తోన్న ఆర్టీపీపీ కూడా మూతపడితే ఇక కరెంటు కోసం ఎవరివైపు చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఆర్టీపీపీ మూతపడితే సంతోషించేది చంద్రబాబేనని, ఆ పేరు చెప్పి దానిని కూడా సింగపూర్ వాళ్లకు అమ్మేస్తారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ ప్రాజెక్టులకు చేసింది శూన్యమని అన్నారు. జీఎన్ఎస్ఎస్‌కు ఆయన తన తొమ్మిదేళ్ల పాలనలో 11 కోట్లు ఇచ్చారు. వెలిగోడుకు 13 కోట్లు ఇచ్చారు. అయినా నీళ్లు వదిలితే ఆ ప్రాజెక్టులలోకి వచ్చే పరిస్థితి ఉందంటే, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండటమే కారణమని చెప్పారు.

అది కూడా కొద్దోగొప్పో డ్యాంలు, కెనాల్స్ పూర్తయ్యాయి కాబట్టి కాస్తయినా నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఇక అనంతపురం అంటే తనకు ప్రాణమని చెప్పే చంద్రబాబు ఎప్పూడు హంద్రీనీవా గురించి మాట్లాడతారని అన్నారు. సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలకు వెన్నుపోటు పొడవడం కష్టం కాదని అన్నారు.

రాయలసీమకు చెందిన ఈ మూడు ప్రాజెక్టులకు కెనాల్ సిస్టం అభివృద్ధి చేసి ఉంటే మార్గమధ్యంలో వందల చెరువులకు నీళ్లు వచ్చేవని చెప్పారు. తద్వారా వేరశనగ పంట వేసిన రైతులకు తోడుగా ఉండేదని అన్నారు. ఇలా రైతులను మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ తీసుకున్నారని విమర్శించారు.

ఇక ప్రజలను మోసం చేయడంలో ఆయన కొడుకు నారా లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారని అన్నారు. కడపలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు ఒకమాట మాట్లాడితే, లోకేష్ ఇంకోమాట మాట్లాడతారని అన్నారు. ఎవరైనా కొడుకులు తండ్రికి మంచి మాటలు చెబుతారని, కానీ చంద్రబాబు మాత్రం పార్టీ, కొడుకు అందరికీ రైతులను ఎలా మోసం చేయాలో నేర్పుతారని ఎద్దేవా చేశారు.

ఎన్నికలకు ముందు బ్యాంకుల్లో రైతులు పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలని ఒక అబద్ధం ఆడండని చెబుతారని అన్నారు. రైతులతో పాటు చివరకు ఆడవాళ్లకు కూడా మోసం చేశాడని ఆరోపించారు. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఊదరగొట్టారని చెప్పారు.

చివరకు చదువుకునే చిన్నపిల్లలను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదని అన్నారు. జాబు రావాలంటే బాబు సీఎం కావాలని అబద్ధాలు చెప్పించాడని, చివరకు ఏ స్థాయిలో అబద్ధాలు ఉన్నాయంటే సీఎం కుర్చీలో కూర్చోడానికి, ఆ తర్వాత కూడా అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు.

చంద్రబాబు పాలన గురించి నాలుగు ముక్కలు చెప్పాలంటే.. అబద్ధం, మోసం, దుర్మార్గం, వెన్నుపోటని అన్నారు. చంద్రబాబుకు తాను ఒక్కటే డిమాండ్ చేస్తున్నానని, నీ పుణ్యమాని కేసీ కెనాల్‌ పరిధిలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఇప్పటివరకు లేదని, 92 వేల ఎకరాల ఆయకట్టును బతికించడానికి జనవరి 15 నాటికి నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు.

చిత్రావతిలో 90 శాతం పనులు వైఎస్ హయాంలో జరిగితే, 10 శాతం పనులు ఇంతవరకు చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడని ఆ పనులు వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. తెలుగుగంగ ద్వారా బ్రహ్మసాగర్‌లో కనీసం 12 టీఎంసీలు నిల్వచేయాలని, వెంటనే మరమ్మతులు పూర్తిచేయాలని కోరారు.

తెలుగు గంగ, జీఎన్ఎస్ఎస్, వెలిగోడు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును విద్యుత్తు కోసం కాకుండా రైతుల కోసం ఉపయోగించాలని అన్నారు.

కడప జిల్లా ప్రజలు, యువకులు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎదురు చూస్తున్నారని, ఆ ఫ్యాక్టరీ పెట్టి పదివేల మందికి ఉద్యోగ ఉపాధిని కల్పించాలని అన్నారు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అంటూ తన ప్రసంగాన్ని జగన్ ముగించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+