జగన్‌కు వాతపెట్టి వెన్నపూస్తోన్న కేంద్రం -15 ఏళ్లలో ఏపీ సూపర్ పవర్ -దివాళ జడిలో అనూహ్య ప్రశంసలు
వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాళా దశకు చేరిందని, అభివృద్ధి పనుల్లో రాష్ట్రం తన కనీస వాటా కూడా ఇచ్చుకోలేని దుస్థితికి దిగజారిందని, సంక్షేమ పథకాల కోసం జగన్ చేస్తోన్న అప్పులు ఏపీ పాలిట ప్రమాదకర సంకేతాలని, ఏపీకి రుణాలిస్తే బ్యాంకులకూ నష్టాలు తప్పవంటూ గడిచిన కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ బడా నేతలు, వైసీపీ రెబల్స్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ విమర్శల జడిలో ఓ అనూహ్య ఘట్టం చోటుచేసుకుంది. వాతపెట్టి వెన్నపూసిన చందంగా అదే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద బ్యాంకు మాత్రం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తింది. వైసీపీ అధినేత చేతలతో ఏపీ రూపురేఖలే మారిపోతాయని అంటోంది.

జగన్‌తో చింతల భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) మన దేశంలో అత్యున్నత అభివృద్ధి ఆర్థిక సంస్థ అన్న సంగతి తెలిసిందే. ఏపీ ఆర్థిక దుస్థితిని కేంద్ర ఆర్థిక శాఖకు వివరిస్తూ, కొత్త రుణాల విషయంలో కట్టడి అవసరమని సురేశ్ ప్రభు లాంటి బీజేపీ సీనియర్లు హెచ్చరించగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అడుగు ముందుకేసి పార్లమెంటులోనే సంచలన ప్రతిపాదన చేశారు. జగన్ లాంటి నేతలు విచ్చలవిడిగా కొనసాగిస్తోన్న ఉచిత పథకాలతో రాష్ట్రాలే కాకుండా వాటికి రుణాలిచ్చే బ్యాంకులూ దివాళా తీస్తాయని, ఈ ప్రమాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీనే అడ్డుకోవాలని, రాష్ట్రాల బడ్జెట్, ఆదాయ పరిమితులకు లోబడే ఉచిత పథకాలు ఉండేలా కేంద్రం కట్టడి చర్యలకు దిగాలని రఘురామ కోరారు. కానీ ఏపీ సీఎం జగన్ తో భేటీలో నాబార్డు చైర్మన్ గోవింద రాజులు చింతల (జీఆర్ చింతల) మాత్రం పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యాఖ్యలు, సంస్థాగత వ్యూహాలు వేర్వేరు అంశాలే అయినప్పటికీ, జగన్ కేంద్రంగా సాగుతోన్న ఈ వ్యవహారాలు చర్చనీయాంశం అయ్యాయి.
జగన్ ఉచిత పథకాలపై సంచలనం -అడ్డుకోవాలంటూ ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ రఘురామ విన్నపం

ఆగ్రహం.. అనుగ్రహం
అన్ని రకాలుగా దిగజారిన ఏపీ ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతూ కేంద్ర కేబినెట్ లో టాప్ 5గా కొనసాగుతోన్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా సంచలన ప్రకట చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జగన్ సర్కారు తన వాటా నిధులను సమకూర్చలేమని చెబుతుండటంతో ఏపీలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, నాటి చంద్రబాబు ప్రభుత్వం కొంత డబ్బును హామీగా చెల్లించినా, మిగతా మొత్తాన్ని కట్టలేక జగన్ చేతులెత్తేశాడంటూ గోయల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కేంద్రం చేసిన ఈ ప్రకటన.. ప్రతిపక్షాలు, జగన్ వ్యతిరేకుల వాదనకు మరింత బలం కూర్చింది. కానీ గంటల వ్యవధిలోనే సీన్ మరోలా కనిపించింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థ నాబార్డు.. జగన్ చేపడుతోన్న పథకాలను, ఏపీ అభ్యున్నతి కోసం ఆయన పడుతోన్న తపనను వేనోళ్లా పొగిడింది. కొత్త రుణాలనూ అనుగ్రహిస్తామని హామీ ఇచ్చింది..

నవరత్నాల సీఎం జగన్..
రాష్ట్ర ప్రభుత్వం చేపడు తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ చాలా బావున్నాయని, ఈ ప్రాజెక్టులపై తాము చాలా ఆసక్తిగా ఉన్నామని నాబార్డు చైర్మన్ జీఆర్ చింతల స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారాయన. ఈ సందర్భంగా నాబార్డు ఆర్థిక సాయంతో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు రాష్ట్రంలో విద్య, వైద్య రంగంతో పాటు ఇతర రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను చితలకు సీఎం వివరించారు. వాటిని శ్రద్ధగా ఆకించిన నాబార్డు చైర్మన్.. ఏపీ సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ ను నవరత్నాల సీఎం అంటూ ఆకాశానికెత్తేశారు. అదే భేటీలో..

మరో రూ.2వేల కోట్ల రుణం..
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం కింద 10 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, తొలివిడతలో లో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు రూ.652 కోట్లు ఇవ్వగా, మిగిలిన స్కూళ్లలో పనుల కోసం మరో రూ.2 వేల కోట్లు ఇవ్వాలని చైర్మన్ జీఆర్ చింతలను సీఎం జగన్ కోరారు. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ పేరుతో అంగన్‌వాడీ కేంద్రాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, ప్రజారోగ్య రంగంలో కూడా నాడు-నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని, ఆర్బీకేలు, మల్టీపర్పస్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు, జనతా బజార్ల ఏర్పాట్లతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, తాగునీటి సరఫరాకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టామని, వీటికి తగిన విధంగా రుణ సహాయం అందించాలని జగన్ విన్నవించారు. చివరికి..

15 ఏళ్లలో ఏపీ సూపర్
సీఎం జగన్ తో భేటీ తర్వాత నాబార్డు చైర్మన్ జీఆర్ చింతల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను నవరత్నాల సీఎం అని పొగుడుతూ, కీలక రంగాల్లో మార్పులు తీసుకురావాలని జగన్ ఎంతో తపనతో ఉన్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రితో అనేక అంశాలపై చర్చించానని, సీఎం చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాల వల్ల వచ్చే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్వరూపం పూర్తిగా మారబోతోందని అన్నారు. ఇప్పటికే ఏపీలో ప్రజలకు మంచి చదువు, మంచి వైద్యం అందు తాయన్నాయని, వీటినిలాగే ముందుకు తీసుకెళితే ఏపీ దశ పూర్తిగా మారుతుందని నాబార్డు చైర్మన్ పేర్కొన్నారు. నాబార్డు చైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఉండడం గర్వకారణం అంటూ జీఆర్ చింతలను సీఎం జగన్ సన్మానించారు.