నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది: బాబుకు సవాల్, జగన్ సంచలన నిర్ణయం
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని, అవసరమైతే వైసీపీ ఎంపీలు రాజీనామా కూడా చేస్తారని ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ప్రవాసాంధ్రులతో ముఖాముఖీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమైన ఈ ముఖాముఖి కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్, కెనడా, కువైట్, సింగపూర్‌ల నుంచి పలువురు ప్రవాసాంధ్రులు జగన్ మాట్లాడారు. ఏపీకి హోదా సాధన కోసం రాష్ట్రంలో చేస్తున్న పోరాటం, హోదా ఆవశ్యకతపై ప్రవాసాంధ్రులతో చర్చించారు.
ఈ సందర్భంగా జగన్ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ముంటే తమ పార్టీ నుంచి ప్రలోభపెట్టి చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని జగన్ సవాల్ విసిరారు.
ఆ 20 స్థానాలలో ఉప ఎన్నికలకు వెళ్దామని, వచ్చే ఫలితాలను రిఫరెండంగా భావిద్దామని తెలిపారు. గతంలో 18 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరితే వారి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లామని ఆయన గుర్తుచేశారు. హోదా కోసం దశలవారీ పోరాటం సాగిస్తామని చెప్పారు.

ఏపీకి ప్రత్యేకహోదా అవసరం
‘‘రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్‌ను కోల్పోయాం. హైదరాబాద్‌తో 98 శాతం ఐటీ ఉద్యోగాలు, 70 శాతం తయారీ రంగం ఉద్యోగాలు ముడిపడి ఉన్నాయి. చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం బెంగళూరు ఉన్న కర్ణాటకకో.. చెన్నై ఉన్న తమిళనాడుకో వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా చాలా అవసరం. హోదా కలిగిన రాష్ట్రాలకు ఆర్థిక రాయితీలు, ఆదాయపన్ను వంద శాతం మినహాయింపు, ఎక్సైజ్ డ్యూటీ, బీమా, రవాణా రంగాల్లోనూ భారీ ఎత్తున రాయితీలు ఉంటాయి. కొత్తగా వచ్చిన జీఎస్టీలోనూ రాయితీ నిబంధనలు చేర్చారు. ఇన్ని రాయితీలు ఉంటేనే ఇతర దేశాల్లో స్థిరపడిన మీలాంటి వాళ్లు ఎవరైనా పరిశ్రమ, హోటల్, ఆస్పత్రి వంటివి పెట్టడానికి ముందుకొస్తారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అప్పుడు ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది. చెనక్కాయలు, బెల్లం ఇచ్చినట్లు అరకొరగా రాయితీలు ఇస్తే దాన్నెలా ప్రత్యేక ప్యాకేజీ అంటారు. ఈ రాయితీల ద్వారా ఏవైనా పరిశ్రమలు వస్తాయా అని వెంకయ్యను ప్రశ్నిస్తున్నా. ఇలాగైతే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో ఏపీ ఎలా పోటీ పడగలుగుతుంది?" అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు సవాల్
"వైసీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యేల చేత కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయిస్తే మేం ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ఉప ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా స్వీకరించడానికి తయారుగా ఉన్నాం. వారికి అధికారం ఉంది, పోలీసులు, డబ్బు అన్నీ ఉన్నాయి. అయినా కూడా చంద్రబాబుకు అవకాశం ఇస్తున్నా. ఉప ఎన్నికలకు వెళ్దాం. ఆ ఫలితాలను రిఫరెండంగా తీసుకుందాం. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజకీయాలు నడపాలనుకోవడం మూర్ఖత్వమవుతుంది. తప్పులు చేస్తున్నపుడు ప్రశ్నిస్తారు. వాటిని స్వాగతించాలి. తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. అసహనం ఉండకూడదు" అని అన్నారు.

2019 ఎన్నికల్లో హోదా ఇచ్చే పార్టీకే మద్దతు
"ఏపీకి హోదా సాధన కోసం ఇప్పటికే రెండున్నరేళ్లుగా పోరాడుతున్నాం. దానిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందో వారికే మద్దతుగా నిలుస్తాం. 2019 ఎన్నికల తరువాత కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండబోదని భావిస్తున్నా. కేంద్రంలో అస్పష్టమైన మెజారిటీ వచ్చి ఏపీ నుంచి వైసీపీ కాంగ్రెస్ తరఫున దేవుడు దయదలచి 22 లేదా 23 సీట్లు గెలిస్తే.. మన సీట్లే ఆక్సిజన్‌గా మనుగడ సాగించగలిగే ప్రభుత్వానికి మద్దతు నిస్తాం. ఆ ప్రభుత్వానికి తప్పకుండా ప్రత్యేక హోదా షరతును విధిస్తాం" అని అన్నారు.

కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం జగన్ మంచివాడు
"రాష్ట్రంలో 5.50 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దేవుడు చంద్రబాబుని సీఎంగానూ నన్ను ప్రతిపక్ష నేతగానూ చేశారు. దేవుడిచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితో వినియోగించుకోవాలి. అందుకే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నా. ఇప్పుడు హోదా పోరాటం చేయకపోతే భావితరాలు క్షమించవు. కేసులు అంటారా.. విధిరాత.. దేవుడు ఎలా పెట్టి ఉంటే అలా అవుతుంది. అయినా నాపై కేసులు పెట్టింది చంద్రబాబుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంత కాలం.. రాజశేఖరరెడ్డి మంచివాడు.. జగన్ మంచివాడు.. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం జగన్ మంచివాడు.. ఎప్పుడైతే ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్‌ను వీడానో అప్పుడు కాంగ్రెస్, టీడీపీలు ఏకమై రాజకీయంగా నన్ను అణగదొక్కేందుకు కుట్రలు పన్నారు." అని పేర్కొన్నారు.

హోదా కోసం జగన్ సంచలన నిర్ణయం: చంద్రబాబుకు సవాల్
గుడి నుంచి గుడిలో లింగాన్ని మింగే వరకూ బాబును మించిన వారు లేరు
"చంద్రబాబు మాదిరి వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ అబద్ధాలు చెప్పడంలోనూ దేశంలోనే కాదు. ప్రపంచంలో ఎవరూ ఉండరు. తెలంగాణలో నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఏసీబీ అధికారులకు ఆడియో, వీడియో టేపుల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా సీఎం పదవికి రాజీనామా చేయరు. అరెస్టు నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకే చెల్లింది. వైఎస్సార్‌సీపీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల చొప్పున నల్లధనం ఇచ్చి కొనుగోలు చేశారు. చంద్రబాబు చేస్తోన్న అవినీతి అంతాఇంతా కాదు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ఈపీసీ పద్ధతిలో ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ జీవో 22 ద్వారా కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేస్తారు. పట్టిసీమ నుంచి పోలవరం దాకా.. ఇసుక నుంచి బొగ్గు వరకూ. బొగ్గు నుంచి జెన్‌కో వరకూ.. జెన్‌కో నుంచి గుడుల వరకూ.. గుడి నుంచి గుడిలో లింగాన్ని మింగే వరకూ బాబును మించిన వారు లేరు. దొంగ పట్టుబడినప్పుడు బతుకు తెలుస్తుంది. చంద్రబాబును దేవుడు మొట్టికాయలు వేసే రోజు ఎంతో దూరంలో లేదు" అని అన్నారు.

సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే తెచ్చుకున్నారు
"ప్రత్యేక హోదాపై మనం పోరాడకపోతే ఎప్పటికీ రాదు. ఈ పోరాటంలో జగన్‌కు మీ అందరి మద్దతు కావాలి. మీరు లేకుండా నేను లేను. ఒకటి మాత్రం చెప్పగలను. మనస్ఫూర్తిగా పోరాడతాను. నా క్యారెక్టర్‌ను నేను ఎప్పుడూ అమ్ముకోలేదు. భవిష్యత్‌లో కూడా ఎప్పుడూ అమ్ముకోను. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడూ రాజీ పడలేదు. పడబోను కూడా. అందరం పోరాటం చేస్తే కచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే వాళ్ళు తెచ్చుకోగలిగినప్పుడు. పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తూ ప్రధానమంత్రి ఇచ్చిన మాట అది. మనం ప్రయత్నం చేస్తే కచ్చితంగా ప్రత్యేకహోదా వస్తుందనే నమ్మకం నాకు ఉంది. పోరాటం చేస్తే కచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ పోరాటాన్ని ఇంత వరకూ రెండున్నరేళ్ళు కొనసాగించాం. ఇంకా రెండున్నర సంవత్సరాలు కూడా దశలవారీగా పోరాటాన్ని ముందుకు తీసుకుని పోతాం" అని ప్రవాసాంధ్రులతో జగన్ అన్నారు.

ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులమా?
"అవినీతిని ప్రశ్నిస్తే అడ్డుతగులుతున్నారని అంటున్నారు. రాజధానిలో అనేక అవినీతి ఉన్నాయి. ఇన్‌సైడర్ ట్రేడింగ్, తనకు సంబంధించిన బినామీలు భూములకు జోనింగ్‌లో మేలు చేయడమే బాబు లక్ష్యం. స్విస్‌చాలెంజ్‌లో ఆయన ఒక పద్ధతి ప్రకారం తనకు కావలసిన వారికి, ప్రయివేటు కంపెనీలకు భూములు ధారాదత్తం చేయడం, దానికోసం ప్రభుత్వం చేత డబ్బులు ఖరుచ పెట్టించడం చేస్తున్నారు. దానివల్ల వేలకోట్ల రూపాయాలు వారి బినామీలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని ప్రశ్నిస్తే వారికి నచ్చదు. పట్టిసీమలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులంటూ మాపై నిందలు వేస్తున్నారు" అని అన్నారు.

వెంకయ్య, చంద్రబాబు మాట మార్చారు
రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదానే సంజీవని అని రాష్ట్ర విభజన సమయంలోనూ, తర్వాత ఎన్నికల సమయంలోనూ వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడులే అన్నారు. ఒకరు అయిదేళ్లు కాదు పదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఇంకొకరేమో పదేళ్లు చాలదు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు ఏమేం మాట్లాడారు? ఎలా ప్లేటు ఫిరాయించారు? అనే అంశాలను ఈనెల 22న ఏలూరులో జరిగిన యువభేరిలో నేను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించాను. బీజేపీ వాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వదల్చుకోలేదు. ఈయన (చంద్రబాబు) వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందుకు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు అలాగే బీజేపీకీ, టీడీపీకి కూడా బుద్ధి చెబుతారు. వెంకయ్య, చంద్రబాబు మధ్య ఏముందో? మొత్తం మీద ఐదు కోట్ల మంది ప్రజలను మాత్రం మోసం చేశారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications