ఢిల్లీ రాజకీయం: ఒకే పంథాలో వైయస్ జగన్, కెసిఆర్
హైదరాబాద్: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఒకే మార్గంలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెసును ఢిల్లీలో తాము సమర్థించబోమని వైయస్ జగన్ చెబుతున్నారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలుంటే మద్దతిస్తామని ఆయన అంటూనే కాంగ్రెసు అధికారంలోకి రాకపోతే తృతీయ ఫ్రంట్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని కెసిఆర్ చెప్పారు.
కాంగ్రెసు రాజకీయానికి అనుగుణంగానే కెసిఆర్, జగన్ రాజకీయాలు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. యుపిఎ భాగస్వామ్య పక్షాల నేతలతో, ముఖ్యంగా ఎన్సీపి అధినేత శరద్ పవార్‌తో వైయస్ జగన్ ముందు నుంచి సన్నిహితంగా మెలుగుతున్నారని అంటారు. తాము అధికారంలోకి రాకపోతే, బిజెపి నేత నరేంద్ర మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెసు కూడా మూడో కూటమిని ముందుకు తోసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

తృతీయ కూటమిలో పలువురు నాయకులు ప్రధాని పదవిని ఆశిస్తున్నారు. ఆ కూటమికి వెలుపల ఉన్న బలమైన నాయకులు కూడా ప్రధాని పదవిని ఆశిస్తున్నారు. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, అన్నాడియంకె నేత జయలలిత, బిఎస్పీ నేత మాయావతి, తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ ఆ పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఎన్సిపీ నేత శరద్ పవార్ కూడా దానిపై కన్నేశారు. ఇందులో భాగంగానే ఆయన కాంగ్రెసుకు దూరం జరుగుతున్నట్లు, తృతీయ కూటమికి దగ్గరవుతున్నట్లు ఆ మధ్య ఓ ప్రకటన చేశారు.
కెసిఆర్ గానీ, వైయస్ జగన్ గానీ ఈ తృతీయ కూటమి అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇది కాంగ్రెసు కోరుకున్నది కూడా అవుతుంది. పలువురు ప్రధాని పదవికి పోటీ పడుతున్నప్పటికీ శరద్ పవార్ విషయంలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు లేకపోలేదు. తృతీయ కూటమి గురించి మాట్లాడుతున్న నేతలు, వెలుపల ఉన్న నేతలు పలువురు బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మోడీని వ్యతిరేకిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కెసిఆర్ వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. రాష్ట్రంలో అవసరమైతే కాంగ్రెసు మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ఆ పార్టీ అధిష్టానం పెద్దల పట్ల ఆయన అనురాగం కురిపిస్తున్నారని అంటున్నారు. అధిష్టానంతో సఖ్యతతో మెలిగితే తెలంగాణ కాంగ్రెసు నేతలను తన దారిలో పెట్టుకోవడం కష్టం కాదని ఆయన భావనగా కనిపిస్తోంది. హంగ్ వస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రంలో కాంగ్రెసు అనుకూల రాజకీయాల ద్వారా రాష్ట్రంలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
బిజెపికి లోకసభలో పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటే తృతీయ కూటమిని ముందుకు తేవాలనే కాంగ్రెసు రాజకీయాలకు అనుగుణంగానే జగన్, కెసిఆర్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఏమైనా, ఫలితాలు వెలువడిన తర్వాత బిజెపికి లేదా ఎన్డీయె కూటమికి పూర్తి మెజారిటీ రాకపోతే రాజకీయాలు దేశంలో రక్తి కట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications