YS Jagan: చంద్రబాబుపై జగన్ ఫైర్-బడ్జెట్ కూ భయమేనా? హామీలు ఎగ్గొట్టేందుకే గోబెల్స్ ప్రచారం..!
ఏపీలో నెలకొన్న పరిస్ధితులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఎన్నికల ఫలితాలు వచ్చిన ఈ 52 రోజుల్లో రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతోందని, కేసు పెట్టడానికి వెళ్తే వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు. ప్రశ్నించడానికి ఎవరూ ఉండకూడదని అణచివేసే ధోరణి కనిపిస్తోందన్నారు.
కొత్తగా ఏర్పడే ప్రభుత్వం 12 నెలల బడ్జెట్ ప్రవేశపెడుతుందని, కానీ 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వాన్న పరిస్ధితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్ధితుల్లో ఉన్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు భయపడుతున్నారు. రెగ్యులర్ బడ్జెట్ పెడితే చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలు బయటపడతాయనే భయం. సూపర్ సిక్స్ హామీలకు కేటాయింపులు కనిపించకపోతే ప్రజలు నిలదీస్తారని భయపడ్డారన్నారు. వీటిని కప్పిపుచ్చేందుకే రాష్ట్రంలో దాడులు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు వంచన, గోబెల్స్ సిద్ధాంతం అనే రెండు లక్షణాలు ఉన్నాయన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు కొత్త కథలు మొదలుపెట్టారని జగన్ ఆరోపించారు. అందుకే రాష్ట్రం ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్తున్నారన్నారు. గతంలో వైసీపీ పాలనలో రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల పాలైందనని చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం చేశాయని జగన్ గుర్తుచేశారు. అయినా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారన్నారు. చివరికి చంద్రబాబు సీఎం అయ్యాక ఎన్నికల హామీలు అమలు చేయమని అడుగుతుంటే తిరిగి 14 లక్షల కోట్ల అప్పుల ప్రచారం తిరిగి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చిందన్నారు. అందుకే తిరిగి ఆర్ధిక ఇబ్బందుల ప్రచారం చేస్తున్నారు.
గతంలో 14 లక్షల కోట్ల అప్పులని ప్రచారం చేసిన చంద్రబాబు.. తాజాగా గవర్నర్ తో 10 లక్షల కోట్లని చెప్పించడాన్ని జగన్ ఆక్షేపించారు. శ్వేతపత్రాలతోనూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రెగ్యులర్ బడ్జెట్ పెడితే ఇవన్నీ చెప్పాల్సి వస్తుందని తప్పించుకుంటున్నారన్నారు. జూన్ వరకూ వాస్తవ అప్పులు చూస్తే 5.18 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు 1.18 వేల కోట్లు, చంద్రబాబు హయాంలో అది 2.71 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇప్పటికి అది 5.18 లక్షల కోట్లకు చేరిందన్నారు. కార్పోరేషన్ల గ్యారంటీలను చూస్తే 50 వేల కోట్లుగా ఉన్న అప్పు, తమ పాలన ముగిసే సరికి లక్ష కోట్లకు చేరిందన్నారు. ఇలా మొత్తం అప్పులు కలిపితే చంద్రబాబు రాక ముందు 1.53 లక్షల కోట్లుంటే ఆయన పాలన ముగిసేసరికి 4.08 లక్షల కోట్లుగా ఉందన్నారు. తమ పాలన ముగిసేసరికి 7.48 లక్షల కోట్లకు చేరిందన్నారు.
21.63 వార్షిక వృద్ధితో అప్పులు చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్ధిక ధ్వంసం చేసినట్లా లేక 12 శాతం వార్షిక వృద్ధిరేటుతో అప్పులు చేసిన వైసీపీ చేసినట్లా అనేది చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. అప్పులపై గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించారని, ఈ విషయంలో చంద్రబాబును మందలించాలని ఆయనకు కూడా ఓ లేఖ రాస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని గుర్తుచేశారు.
వినుకొండలో రషీద్ అనే యువకుడిని నరికి చంపిన ఘటన మీద తాను వెళ్లానని, అతన్ని చంపిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే, నేతలతో సన్నిహితంగా ఉన్నాడని, అందుకే అతని మీద కేసులు పెట్టలేదన్నారు. తాను వినుకొండ వెళ్తుంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు కాలిపోయాయని చంద్రబాబు రివ్యూలు చేశారన్నారు. డీజీపీ, సీఐడీ ఛీఫ్ ను హెలికాఫ్టర్ ఇచ్చి అక్కడికి పంపారన్నారు. ఆర్డీవో కార్యాలయంలో డాక్యుమెంట్లు కాలిపోతే ఎమ్మార్వో కార్యాలయంలో వాటి కాపీలు ఉంటాయని, సీసీఎల్ఏ, ఆన్ లైన్లోనూ అవి ఉంటాయన్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డికి మంచి పేరు ఉండటం వల్లే ప్రజలు వారిని వరుసగా గెలిపిస్తున్నారని జగన్ గుర్తుచేశారు. వారి ఇళ్లపై దాడులు చేస్తూ తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. 45 రోజుల్లో 12 రేప్ లు జరిగాయని, తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే దిశ యాప్ ప్రతీ మొబైల్ లో ఉండేదని, ప్రతీ గ్రామంలో మహిళా పోలీసులు ఉండే వారని జగన్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మహిళల గురించి, దిశ యాప్ గురించి పట్టించుకునే పరిస్ధితి లేదన్నారు.
చంద్రబాబు కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగులు పెట్టడం దారుణమని జగన్ విమర్శించారు. తాము హత్యలు, రేప్ లు చేస్తాం, పోలీసులు కేసు పెడితే చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించేందుకే ఈ హోర్డింగ్ లు పెడుతున్నారన్నారు. వీరిని చూసి గ్రామాల్లో ఉన్న వాళ్లు తమ వ్యక్తిగత కక్షల కోసం ఇదే అమలు చేస్తున్నారన్నారు. ఢిల్లీలో తాను ధర్నాకు వెళ్లిన సమయంలో పెదకూరపాడు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ను కాళ్లు, చేతులూ విరగొట్టారన్నారు. రాష్ట్రంలో ఎవరూ రోడ్లపైకి రాకూడదని, చంద్రబాబు హామీల్ని అమలు చేయమని అడగకూడదన్నారు. అడిగితే దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటికే దీనిపై చర్చ మొదలైందన్నారు.
జగన్ ఉండి ఉంటే ఇప్పటికే అమ్మఒడి డబ్బులు పడి ఉండేవని జనం చెప్పుకుంటున్నారన్నారు. 43 లక్షల మంది తల్లులకు 26 కోట్ల రూపాయలు తాము ఇచ్చామన్నారు. జగన్ ఒక్క 15 వేలే ఇస్తారని, నిర్వహణ పేరుతో మరో రెండు వేలు తీసుకొంటున్నారని, తాము ఎంతమంది ఉంటే అంత మందికీ 15 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. ఇప్పుడు వారంతా డబ్బుల కోసం అడుగుతున్నారన్నారు. జగన్ ఉంటే కనీసం 15 వేలేనా వచ్చేవని చెప్తున్నారన్నారు. తల్లికి వందనం పేరు పెట్టి శఠగోపం పెడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications