శ్రీశైలం మల్లన్న మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవీగండం: పవన్ కళ్యాణ్ సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాక రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీల నేతలు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తూనే, ప్రత్యర్థి పార్టీల నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంతేకాదు ఇదే సమయంలో ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.
శ్రీశైలం మల్లన్న మహా కుంభాభిషేకం వాయిదా
తాజాగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారం కోసం జగన్ జ్యోతిష్యులను నమ్ముతున్నారని, వారు చెప్పిన ప్రకారమే ఆయన ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే శ్రీశైలం మల్లికార్జునుడుకి తరతరాలుగా వస్తున్న మహా కుంభాభిషేకం చేయకుండా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రెండు సార్లు వాయిదా వేశారన్నారు.

జగన్ కు పదవీ గండం ఉందనే మహా కుంభాభిషేకం వాయిదా
కారణం ఏం చెప్పాలో తెలియక ఎండలు బాగా ఉన్నాయని చేయడం లేదని చెప్పారని అయితే అసలు విషయం అది కాదన్నారు పవన్ కళ్యాణ్. శ్రీశైలంలో దక్షిణాయణంలో మల్లికార్జున స్వామి కి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవి గండం ఉందని కొందరు జ్యోతిష్యులు చెప్పడంతోనే ఆ పని చేయలేదని చెప్పారు పవన్ కళ్యాణ్.
శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమైపోతారు
శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతారని, మీరెంత మీ స్థాయి ఎంత అంటూ నిప్పులు చెరిగారు. తరాలుగా వస్తున్న ఆచారాలను తుంగలో తొక్కి, స్వార్థ ప్రయోజనాల కోసం వైసిపి చాలా చేసిందని అది దేవుడైన శివుడికి ఆగ్రహం వస్తే శివుడు మూడో కన్ను తెరిచి వైసీపీని నిలువునా కాల్చేస్తారని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
నూటికి నూరుపాళ్ళు అధికారంలోకి రాకుండా పోతావ్
శ్రీశైల మల్లికార్జున స్వామి మహా కుంభాభిషేకం పదేపదే వాయిదా వేయడానికి కారణమైన వారు సర్వనాశనం అవుతారంటూ వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి మహా కుంభాభిషేకాన్ని పక్కన పెట్టిన మీరు సర్వనాశనం అవడం ఖాయం అంటూ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం నూటికి నూరుపాళ్ళు అధికారంలోకి రాకుండా పోతుంది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications