YSRCP Star Campaigners: వైఎస్సార్సీపీ స్టార్ క్యాంపెయినర్లుగా సామాన్యులే-జాబితా చూశారా ?
ఏపీలో వచ్చే ఎన్నికల్లో సామాన్యులే తమ ప్రచారకర్తలంటూ పదే పదే చెప్పిన సీఎం జగన్ అన్నంత పనీ చేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సామాన్యులను స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేసి ఎన్నికల సంఘానికి జాబితా పంపింది.వీరంతా వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్దిదారులే కావడం విశేషం. వీరిని జనంలోకి పంపడం ద్వారా సంక్షేమ పథకాలు పొందిన ఇతరులను పూర్తిస్దాయిలో పార్టీవైపు మళ్లించడమే దీని లక్ష్యంగా భావిస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ తన స్టార్ క్యాంపెయినర్లను ఎన్నికల కోసం సిద్ధం చేసింది. ఈ మేరకు మొదటి జాబితా రూపంలో 12 మంది రాష్ర్ట స్థాయిలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను వైఎస్సార్ సీపీ ఎన్నికల కమిషన్ కు అందించింది. ఈ మేరకు జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామా స్థాయిలో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారంలో దర్శనమివ్వనున్నారు.ఈ నెల 28 వ తేది నుంచి వైఎస్సార్ సీపీ చేపడుతున్న జగన్ కోసం సిద్ధం ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయనర్లు పాల్గొననున్నారు.

వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా ఎంచుకున్న సామాన్యుల జాబితాలో తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి సిటీకి చెందిన ఎ. అనంతలక్ష్మి, నెల్లూరు జిల్లాకు చెందిన అన్వర్, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన ఈశ్వరి, కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన పండలనేని శివప్రసాద్, అనకాపల్లి జిల్లా మల్లవీధికి చెందిన కటారి జగదీష్ వంటి వారున్నారు. వీరంతా ఇప్పటికే విజయవంతంగా వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారే.
సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు పేద కుటుంబాల్లో ఆర్థిక భరోసాను నింపి ఆయా కుటుంబాలు నిలదొక్కుకునేలా చేసి రోజు వారీ ఆదాయం సంపాదించునేలా చేశాయని వీరు చెప్తున్నారు. పేదలను పేదరికం నుంచి తప్పించి మెరుగైన జీవితం కల్పించాలనే సీఎం జగన్ ఆలోచనకు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు వీరు చెప్తున్నారు. అందుకే సీఎం జగన్ కోసం స్థార్ క్యాంపెయినర్ గా పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మరో పదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వచ్చే వారితో రాష్ర్టం మరో ఎత్తుకు ఎదగనుందని, వారి ఇంగ్లీష్ చదువులతో సాధించే ఉద్యోగాలతో కొన్ని లక్షల కుటుంబాల తలరాత మారిపోనుందని వీరు చెప్తున్నారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక అడుగు ముందుకు వేయడానికి భరోసా లభించిందని, ప్రభుత్వాన్ని ప్రతి గ్రామానికి తెచ్చిన సీఎం జగన్ మద్ధతిస్తూ స్టార్ క్యాంపెయినర్ గా పనిచేసేందుకు సిద్ధమయ్యామని వారు చెప్తున్నారు. సీఎం జగన్ రాష్ర్ట భవిష్యత్తును మారుస్తున్న నాయకుడని తాము నమ్ముతున్నామంటున్నారు.












Click it and Unblock the Notifications