వంగవీటి రంగా జయంతి వేళ.. జగన్ ఆసక్తికర ట్వీట్: పాత జ్ఞాపకాలు
నేడు.. ప్రముఖ కాపు నాయకుడు వంగవీటి రంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి. దీన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని స్మరించుకున్నారు. నివాళి అర్పించారు. ప్రత్యేకించి.. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వేర్వేరు సందర్భాల్లో వైఎస్ఆర్ వారితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.
అలాగే.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా జగన్ వారికి నివాళులర్పించారు. ప్రజా జీవితంలో అత్యంత నిరాడంబరత, రాజకీయ విలువలకు రోశయ్య కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ తో కలిసి రాష్ట్ర సంక్షేమం కోసం సుస్థిర, సమర్థవంతమైన ఆర్థిక విధానాల రూపకల్పనలో రోశయ్య చేసిన కృషి తెలుగు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు.

సామాన్య ప్రజలు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగాను జగన్ గుర్తు చేసుకున్నారు. పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలబడి, వారి అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడిగా అభివర్ణించారు. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ప్రజల గుండెల్లో నిలిచిన రంగా జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ పాలకుల తూటాలకు ఎదురొడ్డి పోరాటం సాగించిన విప్లవ వీరుడని జగన్ గుర్తు చేశారు. ఆయన చూపిన తెగువ, పోరాట స్ఫూర్తి, అఖండ దేశభక్తి.. నేటి యువతకు స్ఫూర్తిని ఇస్తూనే ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజల్లో చైతన్యాన్ని నింపిన నాయకుడిగా పింగళి వెంకయ్య దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయని అన్నారు.












Click it and Unblock the Notifications