జగన్ చేతికి ఏపీ ఉద్యోగుల పీఆర్సీ రిపోర్ట్-రేపు ఉద్యోగులతో భేటీ- అనంతరం తుది ప్రకటన ?
ఏపీలో ఉద్యోగులు కోరుతున్న పీఆర్సీ నివేదిక ఎట్టకేలకు సీఎం జగన్ చేతికి చేరింది. రెండేళ్లుగా ఉద్యోగులు కోరుతున్న పీఆర్సీ నివేదికపై ఇన్నాళ్లూ తాత్సారం చేస్తూ వచ్చిన ప్రభుత్వం. చివరకు ఉద్యోగ సంఘాల ఒత్తిడితో నివేదికపై అడుగులు వేస్తోంది. ఇవాళ సాయంత్రం సీఎం జగన్ తో భేటీ అయిన అధికారుల కమిటీ 11వ పీఆర్సీ నివేదికను ఆయనకు అందించింది. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత రేపు తుది నివేదికను బహిర్గత పరిచే అవకాశముంది.

ఎట్టకేలకు పీఆర్సీ నివేదిక
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11వ పీఆర్సీ అమలు చేస్తామని ఉద్యోగులకు గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. దీని మేరకు వైసీపీ అధికారం చేపట్టాగానే పీఆర్సీ అమలవుతుందని అంతా ఆశించారు. కానీ రెండున్నరేళ్లుగా ప్రభుత్వం దీనిపై తాత్సారం చేస్తూ వచ్చింది. దీంతో ఉద్యోగుల నుంచి ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి పెరగడం ప్రారంభమైంది. దీంతో చేసేది లేక వారు కూడా రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి పలుమార్లు డెడ్ లైన్లు ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. తాజాగా కార్యాచరణ కూడా ప్రారంభించేశాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం త్వరలో పీఆర్సీ ఇచ్చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ అధికారుల కమిటీ రిపోర్ట్ ఇచ్చేసింది.

జగన్ చేతికి పీఆర్సీ రిపోర్ట్
ఇవాళ సాయంత్రం సీఎం జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో పీఆర్సీ నివేదిక తయారీపై నియమించిన అధికారుల కమిటీ భేటీ అయింది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో పీఆర్‌సీ నివేదికను సీఎం వైఎస్ జగన్‌కి చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్) శశిభూషణ్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఆర్సీ నివేదిక తయారీ కోసం తాము చేసిన కసరత్తును సీఎంకు అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.

ఫిట్ మెంట్ పై చర్చించనున్న జగన్
ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఇచ్చిన తుది నివేదికలో ఎంత మేరకు ఫిట్ మెంట్ ఇచ్చారన్నది తెలియరాలేదు. అయితే ఉద్యోగులు మాత్రం 46 శాతం పీఆర్సీ ఫిట్ మెంట్ కోరుతుండగా.. ప్రభుత్వం మాత్రం 36కు కాస్త అటు ఇటుగా ఫిట్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిట్ మెంట్ శాతం పెంపుతో ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారం.. ఉద్యోగ సంఘాలు కోరుతున్న డిమాండ్లు, ఇలా పలు అంశాల్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఉన్నతాధికారులతో దీనిపై చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ రాత్రికి అధికారులతో చర్చించాక దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

రేపు ఉద్యోగ సంఘాలతో భేటీ
ఇవాళ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు రేపు ఉద్యోగ సంఘాల్ని ప్రభుత్వం ఆహ్వానించబోతోంది. ఉద్యోగులతో చర్చించిన తర్వాత తుది పీఆర్సీ నివేదికను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే రేపు ఉద్యోగుల భేటీలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే రేపే పీఆర్సీ రిపోర్ట్ విడుదలయ్యే అవకాశముంది. దానికి ఆమోదం తెలిపి అమలు చేసే తేదీల్ని కూడా ప్రకటించనున్నారు. అలా కాకుండా ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దీనిపై మళ్లీ ఉద్యోగులతో చర్చించి తుది నివేదిక, అమలు తేదీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రేపు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నిర్వహించే భేటీ కీలకంగా మారింది..












Click it and Unblock the Notifications