దూదేకులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్- కించపరిచే ఆ పదాలపై బ్యాన్..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సమాజంలో భాగమైన సామాజికవర్గాలను కించపరిచేలా ఉన్న పలు పదాల్ని ఇప్పటికే పలు ఉత్తర్వుల ద్వారా నిషేధించిన జగన్ సర్కార్.. ఇవాళ మరో సామాజిక వర్గానికి ఊరటనిచ్చేలా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో దూదేకుల సామాజిక వర్గాన్ని కించపరిచేలా వాడుకలో ఉన్న పలు పదాల్ని వెంటనే నిషేధిస్తూ జీవో ఇచ్చింది.
ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ షేక్ దస్తగిరి ద్వారా మైనార్టీ సంక్షేమ శాఖకు అందిన ఓ విజ్ఞాపన ఆధారంగా దూదేకుల సామాజిక వర్గాన్ని కించపరిచేలా వాడుకలో ఉన్న పలు పదాల్ని ప్రభుత్వం ఇవాళ నిషేధించింది. జేఏసీ వినతిని పరిశీలించిన బీసీ కమిషన్.. ఆయా పదాల్ని నిషేధించాలంటూ సిఫార్సు చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇందులో ఏయే పదాలు వాడితే చర్యలు తీసుకుంటారో స్పష్టంగా పేర్కొంది.

దీంతో బీసీల్లో భాగంగా ఉన్న దూదేకులను కించపరిచేలా ప్రస్తుతం వాడుకలో ఉన్న దూదేకులోడా,పింజారీ, పింజారోడా, పింజారిడీ, పింజారీ మొకం, పింజారీ చేష్టలు, లదాఫ్, సగం సాయుబు వంటి పదాల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది.గతంలో ఆయా పదాలు సమాజంలో వాడుకలో ఉండేవని, కానీ ప్రస్తుతం మారిన పరిస్దితుల్లో సమాజంలో ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వాడుకలో ఉన్న వీటిపై నిషేధం అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఇకపై దూదేకులను కించపరిచేలా ఆయా పదాల్ని వాడితే ఐపీసీ చట్టం కింద శిక్షార్హులవుతారని పేర్కొంది. అలాగే దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా మెజిస్ట్రేట్ లను ఆదేశించింది. ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులపై ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ షేక్ దస్తగిరి హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా ఈ జీవో కోసం పోరాటం చేశామని, నూర్బాష కులస్తులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని దస్తగిరి తెలిపారు. ఇప్పటి వరకు చంద్రబాబు మోసపు మాటలను నమ్మి మోసపోయామని, ఇక పై సినిమాల్లో గానీ సమాజంలో గానీ మా కులం పేరుతో తిడితే సీఎం జగన్ అండగా ఉన్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications