ఉండవల్లి డిమాండ్ నెరవేర్చిన జగన్- మార్గదర్శి చిట్స్ పై దాడులు మొదలు !
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న కొన్ని మీడియా సంస్ధలకూ మధ్య సాగుతున్న వార్ అందరికీ సుపరిచితమే. సీఎం జగన్ కొంతకాలంగా ప్రతీ బహిరంగసభలోనూ సదరు మీడియా సంస్ధల్ని పేరు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు ఆయా మీడియా సంస్ధలు ప్రయత్నిస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఇందులో ఒకటైన రామోజీ గ్రూపు సంస్ధ మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ఇవాళ జగన్ సర్కార్ దాడులు చేపట్టింది.
గతంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందంటూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. రాష్ట్రవిభజన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్నీ ఈ విషయంలో సాయం కోరుతున్నారు. అయితే తెలంగాణలో పరిస్ధితి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం ఈనాడు పత్రికకు తోటి గ్రూపు సంస్ధ అయిన మార్గదర్శి చిట్ ఫండ్స్ పై జగన్ సర్కార్ చర్యలు తీసుకోవాలని ఉండవల్లి తాజాగా కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో మూలనపడ్డ మార్గదర్శి కేసును సుప్రీంకోర్టు మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గతంలో ఈ సంస్ధను టార్గెట్ చేసిన మాజీ సీఎం వైఎస్ తనయుడిగా ఇప్పుడు జగన్ కూడా చర్యలు తీసుకోవాలని ఉండవల్లి కోరారు. దీనిపై స్పందించి ఇప్పుడు జగన్ ఇవాళ మార్గదర్శి సంస్ధల కార్యాలయాల్లో తనిఖీలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఇవాళ మార్గదర్శితో పాటు ఇతర చిట్ ఫండ్స్ సంస్ధల కార్యాలయాల్లోనూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉండవల్లి మాత్రం గతంలో మార్గదర్శిపై చర్యలుతీసుకోకుండా రాష్ట్రంలో ఇతర చిట్ ఫండ్ సంస్ధలపై చర్యలు తీసుకుని ఉపయోగం లేదని చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ఇవాళ దాదాపు అన్ని చిట్ ఫండ్ సంస్ధలపై జగన్ సర్కార్ దాడులకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు మరోసారి విచారణకు వస్తున్న నేపథ్యంలో ఈ దాడుల్లో దొరికే ఆధారాలు కీలకంగా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications