• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రశాంత్ కిషోర్ రీ ఎంట్రీ సాధ్యమేనా ? జగన్ లీకుల వెనుక అసలు వ్యూహమిదే ! ఈక్వేషన్లు ఇవే..

|

వైసీపీకి ఏపీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విజయాన్ని అందించిన చరిత్ర రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఉంది. గతంలో ఆయన ఆధ్వర్యంలోని ఐప్యాక్ వైసీపీ తరఫున రెండేళ్ల పాటు పనిచేసి అమలు చేసిన వ్యూహాలు జగన్ కు కలగా మారిన అధికారాన్ని అత్యంత సునాయాసంగా కట్టబెట్టాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ పై జగన్ గురి అమాంతం పెరిగిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకట్రెండు సార్లు రహస్యంగా వచ్చి కలిసి వెళ్లిన పీకే.. ఇప్పుడు మరోసారి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని జగన్ తాజాగా కేబినెట్ భేటీలో మంత్రులకు చెప్పడంతో మరోసారి ఆయనపై చర్చ మొదలైంది.

 ప్రశాంత్ కిషోర్ మాయ

ప్రశాంత్ కిషోర్ మాయ

ఏపీలో 2019కి ముందు వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పేందుకు సొంత పార్టీ నేతలే జంకుతున్న వేళ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. గతంలో మోడీని సైతం ప్రధాని పదవిలో కూర్చొబెట్టేందుకు వ్యూహాలు రచించిన చరిత్రతో పాటు ఈ తరం రాజకీయాలకు అతికినట్లు సరిపోయే సిలబస్ పీకే సొంతం. దీంతో వైఎస్ జగన్ ను అధికారంలోకి తెచ్చేందుకు పీకీ రచించిన ప్రతీ వ్యూహం ఫలించింది. వైసీపీని గెలిపించడంతో పాటు టీడీపీని ఓడించేందుకు ఆయన రచించిన వ్యూహాలు ఇప్పటికీ వైసీపీకి తీపి జ్ఞాపకాలుగా, టీడీపీకి పీడకలలుగా మిగిలిపోయాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలతో మంచి అనుబంధం ఏర్పడింది.

 ప్రశాంత్ కిషోర్ రీ ఎంట్రీ

ప్రశాంత్ కిషోర్ రీ ఎంట్రీ

ఏపీతో పాటు పంజాబ్, తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకున్నవే. స్ధానిక పరిస్దితులకు అనుగుణంగా వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన ప్రశాంత్ కిషోర్ వీరు అధికారంలోకి వచ్చేందుకు ఎంతో ఉపయోగపడ్డారు. అందుకే ఇప్పుడు ఏపీలోనూ సీఎం జగన్ మరోసారి పీకే రీ ఎంట్రీ కోరుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ను మరోసారి ఏపీకి తీసుకురావడం ద్వారా 2024లోనూ అధికారం నిలబెట్టుకోవాలని ఆయన ఇప్పటి నుంచే ఎత్తులు వేసుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంత్రులకు వెల్లడించడంతో బయటికి వచ్చింది.

 మంత్రులకు జగన్ లీకులపై చర్చ

మంత్రులకు జగన్ లీకులపై చర్చ

వైసీపీ మంత్రులకు తాజాగా జరిగిన కేబినెట్ భేటీ సందర్భంగా సీఎం జగన్ ఓ లీకు ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి మనం రోడ్లపై ఉండాలని, ప్రశాంత్ కిషోర్ మరోసారి వస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో కేబినెట్ సమావేశంలో మంత్రులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో ప్రశాంత్ కిషోర్ సేవలు తమకు ఎలా ఉపయోగపడ్డాయో తెలిసిన మంత్రులు.. మరోసారి ఆయన రాకపై నేరుగా అధినేతే హింట్ ఇవ్వడంతో సంతోషంలో మునిగిపోయారు. ఎందుకంటే గతంలో తమ పాత్రను తానే నిర్దేశించి గెలుపుబాట పట్టించిన పీకే మరోసారి వస్తే తమ పని సులువు అవుతుందని మంత్రులు కూడా భావిస్తున్నారు. అయితే పీకే వస్తున్నారంటూ జగన్ ఇచ్చిన లీకులపై మాత్రం చర్చ మొదలైంది.

 టీడీపీ నెగెటివ్ పాలిటిక్స్ వేళ

టీడీపీ నెగెటివ్ పాలిటిక్స్ వేళ

ప్రస్తుతం వైసీపీతో పాటు టీడీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ పాత బృందంలో సభ్యులు పనిచేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ నేరుగా పనిచేయకపోయినా అప్పట్లో ఐ ప్యాక్ లో పనిచేసిన వారి సేవల్నే ఇటు వైసీపీతో పాటు అటు టీడీపీ కూడా తీసుకుంటున్నాయి. దీంతో వైసీపీకి దీటుగా టీడీపీ కూడా రాజకీయం చేస్తోంది. ఇదే అంశం వైసీపీని బాగా ఇరుకునపెడుతోంది కూడా. అన్నింటికంటే మించి ఏ నెగెటివ్ పాలిటిక్స్ తో అయితే వైసీపీ విజయం సాధించిందో అవే పాలిటిక్స్ తో ఇప్పుడు టీడీపీ కూడా దూసుకుపోతోంది. దీంతో వైసీపీకి క్షేత్రస్ధాయిలో చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే టీడీపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అట్రాసిటీ కేసుల్ని నమ్ముకోవాల్సిన పరిస్ధితులు ఎదురవుతున్నాయి.

 వైసీపీలో మొదలైన అంతర్మధనం

వైసీపీలో మొదలైన అంతర్మధనం

ఏపీలో ప్రస్తుతం తమకు దీటుగా టీడీపీ చేస్తున్న రాజకీయాలతో వైసీపీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఇప్పటివరకూ తాము ఏ రాజకీయాలు చేశామో అదే రాజకీయాన్ని టీడీపీ కూడా వంట బట్టించుకుని తమను ఇరుకునపెడుతుండటం వైసీపీని కలవరపెడుతోంది. దీంతో తమ వ్యూహం కచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తను రంగంలోకి దింపడం ద్వారా తమ పని సులువు చేసుకోవాలని వైసీపీ ఆశిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో పీకే ను రంగంలోకి దింపితే వచ్చే అదనపు ప్రయోజనంపైనా వైసీపీలో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సొంత నియోజకవర్గాల్లో తమ పరిస్ధితి బాగోలేదని భావిస్తున్న కొందరు నేతలు పీకీ రీ ఎంట్రీతో తమ కష్టాలు మరింత పెరుగుతాయని, చివరికి తమను జగన్ మరోసారి టికెట్లు నిరాకరించినా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారు.

 జగన్ భరోసా వెనుక వ్యూహమిదే్ ?

జగన్ భరోసా వెనుక వ్యూహమిదే్ ?

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులు వైసీపీ అస్సలు ఊహించలేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశాక సాగించిన దాడులతో ఇక టీడీపీ దుకాణం బంద్ అని వైసీపీ మంత్రులు, నేతలు భావించారు. కానీ రెండేళ్ల వ్యవధిలోనే తమ అనుకూల మీడియాతో పాటు వైసీపీ స్వయంకృతాపరాధాలతో టీడీపీ భారీగా బలపడుతోంది. అదే సమయంలో వైసీపీ పరిస్ధితి దారుణంగా మారిపోతోంది. దీంతో శ్రేణుల్లో గతంతో పోలిస్తే ఆత్మస్ధైర్యం సడలిపోతోందనే నివేదికలు జగన్ కు అందుతున్నాయి. దీంతో ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడంటూ లీకులు ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణులు, నేతల్లో ధైర్యం నింపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ వస్తాడా లేదా అనే దానిపై ఇప్పుడే ఎలాంటి క్లారిటీ లేదని వైసీపీలోనే చర్చ జరుగుతోంది.

 జగన్ కోసం పీకే ఆ త్యాగం చేస్తారా ?

జగన్ కోసం పీకే ఆ త్యాగం చేస్తారా ?

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్ధితుల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటు కోసం బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు మమతా బెనర్జీ, కేజ్రివాల్ వంటి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సాయంతో ఎన్టీయేకు చెక్ చెప్పేలా పావులు కదుపుతున్నారు. అలాగే వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం పంజాబ్ లోని అమరీందర్ సీంగ్ ప్రభుత్వంలో సలహాదారుగా కూడా ఉన్న పీకే .. వచ్చే ఏడాది జరిగే పంజాబ్, హర్యానా, యూపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్ధితి. మరో ఏడాది ఆగితే ఏకంగా 2024 ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లేదా మరో పార్టీ ఆధ్వర్యంలో కూటమి తయారు చేయాల్సిన పరిస్ధితి. అదే సమయంలో కాంగ్రెస్ లో చేరేందుకు పీకే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో పీకే ఇవన్నీ వదిలిపెట్టి జగన్ కోసం అన్నీ త్యాగం చేసి వస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది.

English summary
andhrapradesh cm ys jagan's hint to his mnisters on prashant kishor's re-entry is seems to be boost up confidence amid tdp attacks against ysrcp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X