గేరు మార్చిన జగన్: కోటరీకి బ్రేక్- నాన్న బాటలో..
YS Jagan Mohan Reddy: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం కోలుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తీసుకుంటోన్న నిర్ణయాలపై ఉద్యమాలకు సిద్ధపడుతోంది.
అటు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపైనా దృష్టి సారించింది. కార్యకర్తలు, ప్రజలతో మమేకం కావడానికి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఈ దిశగా ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళికను సైతం రూపొందించుకున్నారాయన.

బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేస్తోన్న నాయకులు, కార్యకర్తలతో వాటిని భర్తీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారిని ఆయా పదవుల్లో నియమించనున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయంపై ఆందోళనలు కొనసాగించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. జనంపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం, ధాన్యం సేకరణలో విఫలం కావడం, సేకరిస్తోన్న ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల పేద కుటుంబాలు ఎదుర్కొంటోన్న సమస్యలపై ఇప్పటికే పోరాటం చేసిందా పార్టీ. దీన్ని మరింత ఉధృతం చేయబోతోంది.
అదే సమయంలో- ప్రజలతో మమేకం కానున్నారు వైఎస్ జగన్. ప్రజా దర్బార్‌ను నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ జరుగనుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. జనం రద్దీని క్రమబద్దీకరించడానికి బ్యారికేడ్లను కట్టారు.
ప్రస్తుతం ఈ ప్రజా దర్బార్- ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. పులివెందుల పర్యటనకు వెళ్లిన ప్రతీసారీ ఇడుపులపాయలో ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తోన్నారు. నియోజకవర్గం, జిల్లా ప్రజలను కలుసుకుంటోన్నారు. రాయలసీమ నాయకులో భేటీ అవుతోన్నారు.
ఇప్పుడు దీన్ని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చే వారితో నేరుగా కలుసుకోనున్నారు. కూటమి ప్రభుత్వంపై వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఎలాంటి అపాయింట్‌మెంట్లు లేకుండా ముఖాయుఖి సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications