జగన్ ముందడుగేస్తే దేవేగౌడ సిద్ధం, ఢిల్లీలో కేసీఆర్-బాబుల కంటే వైసీపీనే కీలకం కానుందా?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఇదే మంచి సమయమా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాజీ సభ్యులు ఓవీ రమణ అన్నారు.

జగన్ ముందడుగేస్తే దేవేగౌడ సిద్ధం
వచ్చే ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర ఎంతో కీలకం కానుందని ఆయన జోస్యం చెప్పారు. జగన్ ముందడుగు వేస్తే కర్ణాటకకు చెందిన జేడీఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీల్ని ఏకం చేయడమే దేవేగౌడ ఎజెండా అన్నారు.

చంద్రబాబుది అవివేకం
రెండు దశాబ్దాల క్రితం దేవేగౌడను తానే ప్రధానమంత్రిగా చేశానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం అవివేకమని విమర్శలు గుప్పించారు. దక్షిణాది నుంచి ప్రధాని కావాలనే ఆయనను ఆనాడు అందరూ కలసి ఎన్నుకున్నారని చెప్పారు. కాగా, ఓవీ రమణ... దేవెగౌడ కుటుంబానికి సన్నిహితులు.

కేసీఆర్, చంద్రబాబుల కంటే జగన్ కీలకం
ఇదిలా ఉండగా, ఇటీవల పలు ప్రీపోల్ సర్వేల్లో వచ్చే లోకసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 23 సీట్లు వస్తాయని తేల్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎన్డీయేకు దాదాపు ఇరవై సీట్లు తగ్గుతాయని తేలింది. దీంతో వచ్చే లోకసభ ఎన్నికల అనంతరం ఢిల్లీలో వైసీపీ కీలకం కానుందని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓవీ రమణ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు ఢిల్లీలో చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీకి ఎక్కువ సీట్లు రానున్నందున ఆయన కూడా చక్రం తిప్పే అవకాశాలు వచ్చాయని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే టీడీపీ, తెరాసల కంటే ఎక్కువ సీట్లు వైసీపీకే వస్తున్నందున ఈయనే కీలకం కానున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications