కేంద్రం సహకారం కోరిన జగన్-విజయనగరం గిరిజన వర్శిటీకి శంఖుస్ధాపన..
విజయనగరం జిల్లా మెంటాడలోని చినమేడపల్లి గ్రామంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి సీఎం జగన్ ఇవాళ శంఖుస్ధాపన చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం గిరిజన వర్శిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వర్శిటీ గిరిపుత్రుల జిల్లాలో వారి జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి ఉపయోగపడుతుందన్నారు. గిరిజనులు ప్రపంచంతో పోటీ పడటానికి ఇక్కడే బీజం పడబోతోందన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం సహకారం కోరారు.
గిరిజనులు స్వచ్ఛమైన మనసులు కలిగిన వారని, తరతరాలుగా వారిని వెంటాడుతున్న పేదరికం, మిగతా ప్రపంచంతో సమం కాని జీవన ప్రమాణాలు, విద్యవైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇంకా భావి ప్రపంచంతో అడుగులు వేయడంలో వారు వెనుకంజలోనే ఉన్నారన్నారు. నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వంలో విద్య, వైద్య,వ్యవసాయపరంగా, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా గిరిజనుల్ని గుండెల్లో పెట్టుకుని అడుగులు వేసినట్లు సీఎం జగన్ తెలిపారు.

మారుతున్న ప్రపంచంలో వారి జీవన ప్రమాణాలు పెంచడానికి, మిగతా ప్రపంచం దోపిడీ నుంచి గిరిజనుల్ని రక్షించడంలో, ఉన్నత విద్యను అందించేందుకు ప్రయత్నించామన్నారు. తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ సోదరుల్ని ప్రాధమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ ప్రోత్సహిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గిరిజనుల విద్యాసాధికారత కోసం మీడియంలో మార్పులు తెచ్చామని, ప్రభుత్వ బడులు ఇంగ్లీష్ మీడియంవైపు అడుగులు వేస్తున్నాయన్నారు. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల విధానం అమలు చేస్తున్నామన్నారు. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయన్నారు.
గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు బాగా చూసుకోవడానికి సంపూర్ణ పోషణ ప్లస్, గోరుముద్ద స్కీంతో పాటు వారు తిని ఆహారంలోనూ మార్పులు తెచ్చినట్లు జగన్ తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆరో తరగతి నుంచి ప్రతీ క్లాస్ రూమ్ నూ డిజిటలైజ్ చేశామన్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ ఎనిమిదో తరగతి నుంచి బైజూస్ ట్యాబ్ లు ఇస్తున్నట్లు జగన్ తెలిపారు. కళ్యాణమస్తు,షాదీతోఫాలోనూ చదవుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తో విద్యాదీవెన, వసతి దీవెన తీసుకొచ్చామన్నారు.

నర్సీపట్నం, పాడేరు, పార్వతీపురంలో నిర్మిస్తున్న మూడు మెడికల్ కాలేజీలు గిరిజన ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని జగన్ తెలిపారు. ఇవాళ పనులు మొదలుపెడుతున్న గిరిజన యూనివర్శిటీతో పాటు పక్కనే గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మొదలయ్యే భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి చూస్తే పాడేరులో మెడికల్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వస్తున్నాయన్నారు.
గత 50 నెలల్లో వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు రాజకీయంగా పదవులు ఇచ్చామని, ఏకంగా డిప్యూటీ సీఎం పదవులు కూడా ఇచ్చామన్నారు. ఎస్టీలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామన్నారు. 4.5 లక్షల గిరిజన కుటుంబాలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ ఇస్తున్నామన్నారు. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక వర్శిటీ, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామన్నారు. ఎస్టీ కమిషన్ కూడా నియమించామన్నారు. ఈ ప్రభుత్వానికి దేవుడి దీవెనలతో పాటు కేంద్రం సహకారం కూడా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications