రుణమాఫీ, మేనిఫెస్టోపై జగన్ కీలక నిర్ణయం..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మూడు పార్టీల ఎన్డీఏ కూటమి తొలి ఎన్నికల సభ నిర్వహించింది. జగన్ తిరిగి అధికారం నిలబెట్టుకోవటం పైన కసరత్తు వేగ వంతం చేసారు. మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. ఈ సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ మేనిఫెస్టో
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల మేనిఫెస్టో పై తుది కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల మేనిఫెస్టోతో జగన్ 151 సీట్లు గెలిచారు. ఇప్పుడు తిరిగి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా అద్దంకి సిద్దం సభలో త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు. చేసేవి మాత్రమే తాను చెబుతానని క్లారిటీ ఇచ్చారు.

2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసామని చెప్పారు. దీంతో, ఈ సారి మేనిఫెస్టోలో జగన్ ఎలాంటి హామీలు ఇస్తారనేది రాజకీయంగానూ ఆసక్తి పెంచుతోంది. రైతులకు రుణమాఫీ చేస్తారా..లేక, ప్రస్తుతం ఇస్తున్న రైతు భరోసా మొత్తాన్ని రూ 20వేలకు పెంచుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
జగన్ ఎన్నికల హామీలు
మహిళలకు 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ చేసారు. తిరిగి ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఆర్దికంగా చేయూత అందించేందుకు ప్రతీ ఏటా ఆర్దికంగా మేలు జరిగేలా కీలక నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 4 వేలకు హామీ ఉంటుందని సమాచారం.
దీంతో పాటుగా ఈ సారి యువతకు సంబంధించి ఆసక్తి కర హామీ ఉంటుందని తెలుస్తోంది. మేనిఫెస్టో ఈ నెల 20న ప్రకటించాలని ముహూర్తంగా ఖరారు చేసారు. దీంతో, పార్టీ ముఖ్యులతో జగన్ మేనిఫెస్టోకు తుది రూపు పైన చర్చించనున్నారు. పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టోను జగన్ పార్టీ నేతల సమక్షంలో ప్రకటించనున్నారు.
ప్రచారం రూట్ మ్యాప్
ఈ మధ్యాహ్నం జగన్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రావటంతో జగన్ బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారానికి సిద్దం అవుతున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో యాత్ర తొలి 20 రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో భారీ బహిరంగ సభకు నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం.. అభ్యర్దులతో సమన్వయం.. పార్టీ మేనిఫెస్టో పై గడప గడపకు తీసుకెళ్లే కార్యాచరణ పైన జగన్ రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. ప్రతీ అభ్యర్ది తమ నియోజకవర్గ పరిధిలో ప్రతీ ఇంటికి వెళ్లేలా జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ రోజు సమావేశంలో జగన్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications