Jaganannaku Chebudam : రేపు జగనన్నకు చెబుదాం ప్రారంభం- టోల్ ఫ్రీ నంబర్, ఇతర వివరాలివే...
ఏపీలో ప్రజలు తమ సమస్యల ఫిర్యాదుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్పందన కార్యక్రమాన్ని మించి మరో కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రేపు జగనన్నకు చెబుదాం పేరుతో సీఎం జగన్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజలు నేరుగా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తమ సమస్యల్ని ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేసేందుకు ఇక్కడ అవకాశం కల్పిస్తారు.
రేపు సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. టోల్‌ఫ్రీ నెంబర్ 1902 కు ఫోన్ చేసి ప్రజలు నేరుగా తమ ఫిర్యాదులు చేసేందుకు ఈ కార్యక్రమం వీలు కల్పించబోతోంది. సంతృప్త స్ధాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా కొత్త కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్ చేయడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభిస్తున్నారు.

సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్ధాయిలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో-జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులున్నా, వైఎస్సార్ పెన్షన్ కానుక అందుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నా, రేషన్ కార్డు వంటివి పొందడంలో అవాంతరాలు ఎదురైనా, రైతన్నలకైనా, అక్కచెల్లెమ్మలకైనా, అవ్వాతాతలకైనా, ప్రభుత్వ సేవలు పొందడంలో అవాంతరాలు ఎదురైనా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు అందుకోవడంలో సమస్యలున్నా, రెవెన్యూ రికార్డులకు సంబంధించి సమస్యలున్నా, ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర వ్యక్తిగత ఇబ్బందులున్నా సమస్య పరిష్కారానికైనా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేయొచ్చని చెబుతోంది.
ఇలా వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం ఎలా చేయబోతోందో కూడా ప్రభుత్వం వెల్లడించింది. ప్రజల నుంచి సమస్యను చెప్పేందుకు 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది, దీంతో ఫిర్యాదును నమోదు చేసుకుని YSR (యువర్ సర్వీస్ రిక్వెస్ట్) ఐడీని కేటాయిస్తారని, ఎప్పటికప్పుడు అర్జీ స్టేటస్ గురించి ఎస్‌ఎంఎస్ ద్వారా అప్‌డేట్ అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోవాలని కోరుతోంది.

ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలు తెలుసుకునేందుకు వీలు కల్పించడంతో పాటు వారి నుండి ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం అందించడం, ఫిర్యాదు స్టేటస్ ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితిని, వాటి పరిష్కారం గురించి తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి తేవడం దీని ముఖ్య ఉద్దేశం. అనేక సమస్యలకు అత్యున్నత స్ధాయిలో పరిష్కారం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌లతో పాటు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications