YS Jagan :తెలంగాణపై కేంద్రానికి జగన్ ఫిర్యాదులు-నీటి ప్రాజెక్టులపై-సీమ లిఫ్ట్ కు అనుమతికి వినతి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో కేంద్రం నుంచి అనుమతులు కూడా రాకపోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం జగన్.. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ను రాయలసీమ లిఫ్ట్ కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు అనుమతి కోరారు. అదే సమయంలో తెలంగాణ తీరుపై ఫిర్యాదు చేశారు.

కేంద్రమంత్రి భూపేంద్రతో జగన్ భేటీ
కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ఏపీ సీఎం వైయస్.జగన్ ఇవాళ భేటీ అయ్యారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రికి సీఎం పలు వినతులు అందించారు. ఇందులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ముఖ్యమైనది. రాయలసీమ లిఫ్ట్‌ఇరిగేషన్ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని సీఎం జగన్ కోరారు. కరవుతో అల్లాడే ఈప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించడానికి ఈ పథకం అత్యంత కీలకమైనది వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌రిజర్వాయర్లకు సంబంధించి పలు అంశాలను కూడా వివరించారు.

తెలంగాణపై ఫిర్యాదులు
కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు యొక్క అన్ని ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని సీఎం జగన్ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకు కృష్ణా నదిపై తనకున్న వాటా హక్కులను కోల్పోవాల్సి వస్తోందని జగన్ తెలిపారు. 2022-22, 2022-23 సంవత్సరాలలో తెలంగాణా రాష్ట్రం- సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్ 1తేదీ నుంచే విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడం ప్రారంభించిందని సీఎం జగన్ కేంద్రమంత్రికి వివరించారు.
శ్రీశైలం జలాశయంలో కనీస నీటి స్ధాయి 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ... తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి నీటి విడుదల చేయడంతో పాటు , కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ముందు కనీసం ఎలాంటి ఇండెంట్ కూడా లేకుండానే, ఏకపక్షంగా నాగార్జున సాగర్, కృష్టా డెల్టాకు అవసరం లేనప్పటికీ నీటి విడుదల చేసిందని తెలిపారు. నీటి పారుదల అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి అన్నది కేవలం యాధృచ్చికంగా మాత్రమే ఉంటుందనే విషయాన్ని స్పష్టంచేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా 796 అడుగుల వరకు నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల... శ్రీశైలం రిజర్వాయరులో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందిని గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకువచ్చానని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

రాయలసీమ లిఫ్ట్ కు అనుమతి
తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున నిర్మిస్తున్న పాలుమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తున్న విషయం ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వలన రిజర్వాయరు నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన నీటిని వాడుకోవడానికి కూడా సాధ్యపడదని వెల్లడించారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో.... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం(ఆర్‌ఎల్‌ఎస్)ను అమలు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని టీజీపీ, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌లకు సరఫరా చేయగలుగుతామన్నారు.
తెలంగాణా ప్రభుత్వం నిబంధనలు మరియు ప్రోటోకాల్స్‌ను పూర్తిగా విస్మరించి నీటిని విడుదల చేయడంతో అనుసరిస్తున్న అనుచిత వైఖరిని దృష్టిలో పెట్టుకుని.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను మరింత ప్రమాదంలో పడకుండా నివారించవచ్చునని, అంతకుమించి ఒక్క ఎకరా అదనపు ఆయుకట్టు కల్పించడంతో పాటు, ఒక్క చుక్క అదనపు నీటి నిల్వను కూడా పెంచడం లేదన్న విషయాన్ని కేంద్రమంత్రికి జగన్ వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేశామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అటవీపర్యావరణ శాఖ అధికారులకు మధ్య సమగ్ర చర్చలు జరిగాయన్నారు. అందుకు అవసరమైన మొత్తం సమాచారం కూడా ఇప్పటికే అందించామని, ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, ప్రాజెక్టు ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్‌జెడ్) నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు ఇది కూడా కేవలం ప్రధాన కాలువకు పూర్తి స్ధాయిలో నీటిని అందించడం కోసమేనంటూ కేంద్రమంత్రికి వివరాలు అందించారు. వీలైనంత త్వరలో రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని సీఎం జగన్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

పోర్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకూ..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్ధిక కార్యకలాపాలకు అనువుగా ఉందని, ఏపీ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులలో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తోందని కేంద్రమంత్రికి జగన్ తెలిపారు. దీంతో పాటు తీరప్రాంతంలో సుమారు 10 లక్షల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధిగా చేపలపట్టడంతో పాటు, మత్స్య అనుబంద కార్యకలాపాలపై ఆధాపడి ఉన్నాయని తెలిపారు. ఈ బలహీన వర్గాలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9 వ్యూహాత్మక ప్రదేశాలలో ఫిషింగ్ హార్భర్‌ల అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చిందని, రామాయపట్నం ఓడరేవుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మార్చి, 2024 నాటికి పోర్ట్ కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయని వివరించారు.
మిగిలిన రెండు పోర్టుల కోసం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్‌లలో పర్యావరణ అనుమతులు మంజూరు కోసం దరఖాస్తు చేశామన్నారు. అవసరమైన సమచారాన్ని కూడా అందజేశామన్నారు. ఈ పనులను ఏపీ ప్రభుత్వం వీలైనంత వేగంగా ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన అనుమతులు మంజూరుకు కేంద్రం సాయం కోరారు. అలాగే ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు వంటి చోట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు కూడా అనుమతులు ఇవ్వాలని కోరారు. వీటితో పాటు వైఎస్‌ఆర్ జిల్లా గండికొట వద్ద 1000 మెగావాట్స్ పంప్డు స్టోరేజీ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదన పంపించిందని, లోయర్ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టు (230 మెగావాట్లు), అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు(1350 మెగావాట్లు) సామర్ధ్యంతో చేపడుతోందని, వీటికి సంబంధించిన పర్యావరణ అనుమతులు కోసం దరఖాస్తు చేశామని, రాష్ట్ర ప్రగతికి అవసరమైన ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలంటూ అభ్యర్థించారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications