సీతయ్య ఎవరి మాటా వినడు: జగన్ తీరు అదేనా? (పిక్చర్స్)
హైదరాబాద్: సీతయ్య ఎవరి మాట వినడు అనే సినిమా డైలాగు తెలుగులో చాలా పాపులర్ అయింది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విషయంలో అదే మాట ప్రచారం ఉంది. తాను అనుకున్నట్లు, తాను చెప్పినట్లు నాయకులు వినాల్సిందే తప్ప వారి సలహాలను అడిగి పునరాలోచించి నిర్ణయాలు తీసుకుని వైఖరి అతనిలో లేదని గిట్టనివారు అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగడానికి జగన్ ఏకపక్ష, వైఖరిని ఒక కారణంగా నాయకులు చెబతూ వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఆందోళనలు చేపడుతూ ప్రజలను కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ఉన్న శాసనసభ్యులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం లేదనే మాట వినిపిస్తోంది.
అయితే, ప్రజలు తన వెంట ఉంటే చాలు, నాయకులు అవసరం లేదనే భావనలో ఆయన ఉన్నట్లు కూడా అనుకోవచ్చు. తన వైపు ఉన్న ప్రజల బలం వల్ల తాను ఎవరిని నిలబెట్టినా గెలుస్తారనే ధీమా కూడా ఆయనకు ఉండవచ్చు. అయితే, ప్రజల మాట ఎలా ఉన్నా పార్టీ కార్యకర్తల్లో మాత్రం అసంతృప్తి పేరుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

అదే కారణం కాకపోవచ్చు..
అధికార టిడిపి ప్రలోభాలకు కొంత మంది ఎమ్మెల్యేలు తలొగ్గి వైసిపిని కొందరు ఎమ్మెల్యేలు వీడినప్పటికీ అదే ప్రధాన కారణం కాకపోవచ్చని కూడా అంటున్నారు. భూమా నాగిరెడ్డి. జ్యోతుల నెహ్రూ వంటివారిని ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు.

జగన్ ఆలోచించక తప్పదు...
పార్టీని శానససభ్యులు వీడడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే దిశలో జగన్ ఆలోచించక తప్పదని అంటున్నారు. ఏ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్తున్నారన్న సమాచారం కూడా ముందస్తుగా పార్టీలోని తన సన్నిహితుల ద్వారా, సీనియర్ నేతల ద్వారా జగన్‌కు వెళ్తోందన్న ప్రచారం కూడా ఉంది.

వారికి తెలిసే ఉంటుంది...
పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సమాచారం ఇస్తున్న నాయకులకు దాని వెనకగల బలమైన కారణాలు కూడా తెలసివుంటాయని అంటున్నారు. కనీసం ఆ కారణాల వైపు దృష్టి సారించి కనీసం తన వైఖరి విషయంలోనూ జగన్ ఆలోచిస్తే మంచిదని అంటున్నారు.

పోరులో ముందున్నా...
ప్రజా సమస్యలపై పోరులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ముందున్నా పార్టీ పట్టిష్టతపై ఆ పార్టీ ఉద్యమాల ప్రభావం కనిపించడంలేదనే అభిప్రాయం ఉంది.

భేటీలు లేవు... సమావేశాల్లో తాను చెప్పడమే...
పార్టీ నాయకులతో జగన్ ఆత్మీయ భేటీలు లేకుండా పోయాయని, ఒక వేళ సమావేశాలు ఏర్పాటు చేసినా తాను చెప్పింది వారు వినాల్సిందే తప్ప ఇతరులు చెప్పడానికి అవకాశం ఇవ్వరని అంటున్నారు.

వారేరీ.. అప్పుడో ఆకర్షణ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆకర్షణగా, క్రౌడ్ పుల్లర్స్‌గా భావించిన వైయస్ జగన్ తల్లి విజయమ్మ గానీ సోదరి షర్మిల గానీ ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అది కూడా పెద్ద లోటేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications