మోదీకి మోకరిల్లారు- వైఎస్ షర్మిల అరెస్ట్.. ఉద్రిక్తత
YS Sharmila: రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం.. మలుపులు తిరుగుతోంది. ఈ మధ్యే ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ సైతం అమలులోకి వచ్చింది. తొలి దశలో 1,140 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అనుమతి లభించింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు జరిగిన నిరసన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేసింది.

ప్రైవేటీకరణ కోరల నుంచి ఈ ప్లాంట్ ను పరిరక్షించుకోవడానికి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. నిరసన దీక్షలు, రిలే నిరాహార దీక్షలనూ నిర్వహిస్తూ వస్తోన్నాయి. ఇవి రోజురోజుకూ తీవ్రతరమౌతోన్నాయి. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవట్లేదు.
ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మిక సంఘాల నిరసనలకు సంఘీభావంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ ఉదయం విశాఖపట్నం కూర్మన్నపాలెంలో గల కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అక్కడ ఆమరణ దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తామిన, ప్రైవేటుపరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు షర్మిల. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో నడిచిన ప్లాంట్ బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాల్లోకి వెళ్ళిపోయిందని ధ్వజమెత్తారు.
వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారని, అయినా కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఊడిగం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదని నిలదీశారు.
దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప్రయ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..కూటమి సర్కార్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అకారణంగా విధుల నుంచి తొలగించిన 2,000 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులను తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని, కార్మికుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని షర్మిల చెప్పారు. ఆంధ్రుల హక్కు- విశాఖ ఉక్కు నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాల్లో నడిచిందని, బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాలు మొదలయ్యాయని, ఆ పేరుతోనే దీన్ని అమ్మి వేయడానికి రంగం సిద్దం చేసిందని షర్మిల విమర్శించారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలను తొలగించడం, ముడి సరుకు అందకుండా కుట్రలు చేస్తోందని, ప్లాంట్‌కు సొంత మైన్ ఇవ్వకుండా అడ్డుకుటోందని షర్మిల మండిపడ్డారు.

11,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్లాంట్ ను ఉద్ధరించడం అనేది పచ్చి అబద్ధమని షర్మిల ధ్వజమెత్తారు. ఇచ్చినట్లే ఇచ్చి 8,000 కోట్ల బ్యాంక్ రుణాల కింద వెనక్కి తీసుకున్నారని అన్నారు. మరో 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే 5,000 మంది ఉద్యోగులను తొలగించాలని కండీషన్ పెట్టారని గుర్తు చేశారు.
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిలను కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల దీక్షను భగ్నం చేశారు. తమ వాహనంలో శిబిరం నుంచి తరలించారు. షర్మిల అరెస్టును కాంగ్రెస్ పార్టీ నాయకులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తోపులాట చోటు చేసుకుంది.
రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు దీక్షా శిబిరానికి చేరుకున్నారు. దీక్షను విరమించాలంటూ షర్మిలకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె నిరాకరించారు. అకారణంగా తొలగించిన 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రజాస్వామ్య బద్దంగా, గాంధేయ మార్గంలో దీక్ష చేస్తుంటే పోలీసులు భగ్నం చేయడం దారుణమని అన్నారు.
ఒక మహిళ అని చూడకుండా అత్యంత పాశవికంగా అరెస్ట్ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్రగా అభివర్ణించారు. కార్మికుల పక్షాన ప్రశ్నించే గొంతుకను అణగదొక్కి, వారి పొట్ట కొట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.
ఆంధ్రుల హక్కు - విశాఖ ఉక్కును అందరూ కలిసి అమ్మేయాలన్ని పన్నాగాలు పన్నుతున్నారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కుట్రలు చేసుంటే ప్రశ్నించకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీకి మోకరిల్లారని ఆరోపించారు.
ఆంధ్రుల ఆత్మగౌరవం స్టీల్ ప్లాంట్ ను మోదీ కోసం తాకట్టు పెట్టారని వైఎస్ షర్మిల అన్నారు. దీక్షలు భగ్నం చేసినా, కార్మికులను భయపెట్టి సమ్మె విచ్చిన్నం చేసినా, రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తుందని షర్మిల కార్మికులకు హామీ ఇచ్చారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications