రాజారెడ్డి వైఎస్ వారసుడే-తేల్చేసిన షర్మిల..! కీలక వ్యాఖ్యలు..!
తన కుమారుడు వైఎస్ రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ సమర్ధించుకున్నారు. ఈ విషయంలో వైసీపీ తనపై, రాజారెడ్డిపై చేస్తున్న ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. వైఎస్ రాజారెడ్డి ముమ్మాటికీ వైఎస్ రాజకీయ వారసుడేనన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలూ అవసరం లేదన్నారు. ఈ సందర్బంగా వైసీపీ తీరుపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
తన కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదని, పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే.... ఇది భయమా ? బెదురా ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వాళ్ళకే తెలియాలన్నారు. రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయంగా వైఎస్సార్ అన్నారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల పెట్టినా తన కొడుకు వైఎస్ రాజారెడ్డినే అన్నారు. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేరన్నారు.

తన కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడన్నారు. చంద్రబాబు చెప్తే తన కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆక్షేపించారు. కష్టపడి ఒక వీడియో మార్ఫింగ్ చేశారని, తనకు దాన్ని చూసి నవ్వు వచ్చిందని, ఇంత కష్టం ఎందుకు అని ? అన్నారు. తన కొడుకుని చంద్రబాబు చెప్తే తీసుకొస్తే ...మరి ఎవరు చెప్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆరెస్సెస్ వాదికి మద్దతు ఇచ్చారని జగన్ ను ఆమె ప్రశ్నించారు.
నిస్సిగ్గుగా ఆరెస్సెస్ అభ్యర్థికి జగన్ మద్దతు ఇవ్వడం అవమానకరం అన్నారు. వైఎస్సార్ తన జీవితకాలం బీజేపీ నీ వ్యతిరేకించారని గుర్తుచేసారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే జగన్ చేసిన పనికి అవమానంతో, సిగ్గుతో తలదించుకునే వాడన్నారు. సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలన్నారు. సుదర్శన్ రెడ్డి న్యాయ నిపుణులని,రాజ్యాంగం గురించి తెలిసిన వాడన్నారు. ఇలాంటి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదని నిలదీశారు.
జగన్ మోదీకి దత్తపుత్రుడని, మోడీ చెప్పినట్లు ఆడుతున్నాడని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉంది అని చెప్పిన జగన్.. అదే రిలయన్స్ వాళ్ళకు రాజ్యసభ ఇచ్చాడన్నారు. మోడీ కోసం అదానీకి గంగవరం పోర్ట్ కట్టబెట్టారన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారని, జగన్ ఏ మొహం పెట్టుకొని మద్దతు ఇచ్చావు సమాధానం చెప్పు అన్నారు.

టీడీపీ జనసేన బహిరంగ పొత్తని, జగన్ ది తెరవెనుక పొత్తు అని షర్మిల తెలిపారు. బీజేపీ తొత్తుగా,తోక పార్టీగా YCP పని చేస్తుంది
వైఎస్సార్ కొడుకుగా ఏమైనా తండ్రి ఐడియాలజీ మిగిలి ఉందా అని ప్రశ్నించారు. వైసీపీకి అజెండా లేదు, జెండా లేదు, ఐడియాలజీ లేదన్నారు. జగన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారన్నారు. మీకు దమ్ముంటే బీజేపీ కి తోక పార్టీ అని ఒప్పుకోండన్నారు. దైర్యం లేకుంటే చేతిమీద బీజేపీ అని పచ్చబొట్టు వేసుకోండన్నారు. పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎవరికి ఓటు వేయకుండా మౌనంగా ఉన్నారని, వైసీపీకి ఆ మాత్రం ఇంగితం లేదన్నారు. వైఎస్సార్ వారసుడు అయి ఉండి బీజేపీ కి ఓటు వేయడం సిగ్గుచేటన్నారు. చరిత్రలో వైఎస్సార్ ఛాతీలో కత్తితో పొడిచిన వాడుగా జగన్ మిగిలిపోతాడన్నారు.
-












Click it and Unblock the Notifications