
వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు ఆ పని చేస్తే మంచిదంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!!
మాజీ మంత్రి, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న వైయస్ షర్మిల వివేకానంద రెడ్డి హత్య కేసును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య తమ కుటుంబం లో జరిగిన ఘోరమైన ఘటనగా వైయస్ షర్మిల పేర్కొన్నారు.

బాబాయ్ ను హత్య చేసింది ఎవరో బయటకు రావాలి: వైఎస్ షర్మిల
బాబాయ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వైయస్ షర్మిల తన చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో, వారికి శిక్ష పడాలని పేర్కొన్నారు. తన సోదరి సునీతకు న్యాయం జరగాలని వైయస్ షర్మిల ఆకాంక్షించారు. దర్యాప్తును ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదని పేర్కొన్న షర్మిల, దర్యాప్తును సుప్రీం కోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన బాబాయ్ ని ఎవరు హతమార్చారో .. ఎందుకు హతమార్చారు బయటకు రావాలని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

వివేకా హత్యకేసుకు సంబంధించి రాజకీయ కారణాలు సీబీఐ దర్యాప్తులో తేలతాయి
వివేకా హత్య కేసు కు సంబంధించిన రాజకీయ కారణాల పై సీబీఐ చేస్తున్న దర్యాప్తు పై మాట్లాడిన షర్మిల, సిబిఐ దర్యాప్తు లో అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదలాయించాలని వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి చేసిన డిమాండ్ కు సిబీఐ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన సోదరి సునీత రెడ్డికి న్యాయం జరగాలని వైయస్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారాయి.

వివేకా హత్యకేసును వేరే రాష్ట్రానికి బదలాయించాలని సునీత పిటీషన్ విచారణ
వైయస్ వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసినా పరవాలేదని సునీత సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని వివేకా హత్య కేసులో సునీత ఆరోపణలు చేశారు. ఏపీలో జరుగుతున్న దర్యాప్తుపై తమకు నమ్మకం పోయిందని పేర్కొన్న ఆమె హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు కూడా భద్రత లేనందున ఇతర రాష్ట్రం లోని సీబీఐ కోర్టులో దర్యాప్తుకు అప్పగించడం మంచిదని ఆమె సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

తాజా పరిమాణాలతో వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఆసక్తి
ఇక సునీత చేసిన వాదనతో సిబిఐ కూడా ఏకీభవించడంతో సుప్రీంకోర్టు ఈ కేసును వేరే రాష్ట్రానికి బదలాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంలో వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒకపక్క ఏపీ ప్రభుత్వంపై, ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురిపై వైఎస్ వివేకా హత్యకేసు ఆరోపణలు ఉండటం, వైఎస్ జగన్ ను కూడా ఈ కేసులో టార్గెట్ చేసి ప్రతిపక్షాలు విమర్శించటంతో పాటు, వైఎస్ సునీత కూడా ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని చెప్పటంతో, తాజాగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.