తల్లికి వందనంపై వైసీపీ విమర్శలకు షర్మిల ఘాటు కౌంటర్..!
ఏపీలో తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కుదేలవడంతో ఆ స్ధానాన్ని భర్తీ చేసేందుకు రంగంలోకి దిగిన పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల.. కూటమి ప్రభుత్వంతో పాటు జగన్ పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందనం పథకంపై వైసీపీ పత్రిక సాక్షిలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వివరణ ఇవ్వడంతో టీడీపీ-కాంగ్రెస్ బంధమంటూ వైసీపీ విమర్శలకు దిగింది. దీంతో షర్మిల ఘాటు కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ విమర్శలపై స్పందించిన వైఎస్ షర్మిల.. పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఆ పార్టీ తీరు ఉందన్నారు. సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అడిగితే ...
బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనమంటూ షర్మిల పేర్కొన్నారు. వైసీపీ నేతలకు కళ్ళుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే... తాము చెప్పింది ఏంటో ఒకటికి పది సార్లు వినాలన్నారు.

తల్లికి వందనం జీవో 29పై క్లారిటీ లేదని, సాక్షి రాసిన వార్తకి వివరణ ఇవ్వాలని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేస్తే .. కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుందని షర్మిల ప్రశ్నించారు.
తాము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుందన్నారు.
ప్రతిపక్షంగా తల్లుల పక్షాన తాము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుందని నిలదీశారు.
2019 ఎన్నికల కంటే ముందు జగన్ గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా అని వైసీపీని షర్మిల ప్రశ్నించారు.
ఆ ముక్క పట్టుకొని తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదా అని అడిగారు. అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా అని అడిగారు. అది ప్రజలు మీకిచ్చిన తీర్పే చెప్తోందన్నారు. ఆ రోజు తన చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా అని నిలదీశారు.
తాను వైసీపీ కోసం బై బై బాబు కాంపెయిన్ చేయడం ఎంత నిజమో అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15 వేల రూపాయిలు చొప్పున, ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజమన్నారు. మరి మీకు 15 వేలు ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే తన చేత ఎందుకు అలా ప్రచారం చేయించారని వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం అని, జలయజ్ఞం పూర్తి చేస్తాం అని, ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎందుకు కాంపెయిన్ చేయించారని అడిగారు. మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అని షర్మిల సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications