రేషన్ మాఫియాపై... పవన్, చంద్రబాబు, జగన్.. ముగ్గుర్నీ మడతబెట్టి..!
కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టివేతపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఇటు చంద్రబాబు ప్రభుత్వాన్ని, అటు గత వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇది జాతీయస్థాయి కుంభకోణం అని అభిప్రాయపడ్డారు. ఆంధ్రపదేశ్ అంటే అన్నపూర్ణమ్మ. ధాన్యాగారానికి భాండాగారం అంటూ పేర్కొన్న షర్మిల ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని నిప్పులు చెరిగారు.
పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా
ఆరుగాలం కష్టించి పడించే రైతుకు దక్కేది కన్నీళ్లు అయితే... బియ్యం అక్రమార్కులకు దక్కుతున్నవి కాసులని, ఇది మన రాష్ట్ర దుస్థితి అని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని పేర్కొన్న వైఎస్ షర్మిల పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ ఇది అని అభివర్ణించారు.

రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం
తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు.
క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళుమూసుకుందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు.
మూడేళ్ళలో పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా
ఇక ఇదే సమయంలో గత జగన్ సర్కార్ ను కూడా షర్మిల టార్గెట్ చేశారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో రేషన్ రైస్ మాఫియా రెచ్చిపోతుందన్నారు. మూడేళ్ళలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చునన్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చునని షర్మిల పేర్కొన్నారు.
పవన్ బోట్లు వేసుకొని వెళ్లి సముద్రంలో హడావిడి చేయడం కాదు
కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని పేర్కొన్న షర్మిల పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని వెళ్లి సముద్రంలో హడావిడి చేయడం కాదు. నిజాలు నిగ్గు తేల్చండి అంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని నిరుపేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది ? చెప్పాలని ప్రశ్నించారు.
రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు ?
మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు ? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు ? అంటూ గట్టిగా నిలదీశారు.
రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు ? లెక్క తీయాలన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా ? తీగ లాగితే వెనకున్న డొంక ఎక్కడ ? అంటూ ప్రశ్నించారు.
CBIతో విచారణకు షర్మిల డిమాండ్
ఇందులో మిల్లర్ల చేతివాటం ఉందా ? రేషన్ డీలర్ల మాయా జాలం ఉందా చెప్పాలన్నారు. నిత్యం తనిఖీల సంగతి ఏంటి ? నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు . ఈ జాతీయ స్థాయి కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ CBIతో విచారణ జరిపించాలన్నారు.












Click it and Unblock the Notifications