కర్నూలు జిల్లాలో వైసిపి నేత దారుణ హత్య: పాత కక్షలే కారణం
కర్నూలు: కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఒకరిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా చంపారు. కౌతాల మండలం రౌడూరు గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రామన్న గౌడ్‌ను (45)ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు.
పొలానికి వెళ్లి వస్తుండగా రామన్నగౌడ్‌పై దుండగులు దాడి చేశారు. అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

రామన్నగౌడ్ హత్యకు పాతకక్షలే కారణమని అనుమానిస్తున్నారు. ప్రత్యర్థి వర్గానికి చెందినవారే అతన్ని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వాహనాలను దొంగిలిస్తున్న పది మంది సభ్యుల ముఠాను శుక్రవారం మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 టిప్పర్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు రూ.2 కోట్ల విలువైన వాహనాలను, వస్తువులను దొంగిలించినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications