బాబు సమక్షంలో టిడిపిలోకి జగన్ పార్టీ నేతలు (ఫొటో)
మెదక్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో మెదక్ జిల్లాకు చెందిన పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు టిడిపిలో చేరారు. మెదక్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ భట్టి జగపతి గురువారం చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆయనతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిహెచ్ నర్సింహులు, జి వెంకటేశం, శేఖర్ గౌడ్, గౌస్, ముజీబ్, అంజయ్య, తదితరులు టిడిపిలో చేరారు. వారందరినీ చంద్రబాబు నాయుడు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, ఎకె గంగాధర్ రావు, తిరుపతి రెడ్డి, వెంకటరమణ, సోమశేఖర్, ఆరిఫ్, రామయ్యలు ఉన్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గిరిజనులకు తెలుగుదేశం పార్టీ ద్వారానే సంపూర్ణ న్యాయం జరుగుతుందని విశ్వసించి తాను పార్టీలో చేరుతున్నట్లు బాబూరావు తెలిపారు.
తెలంగాణ ప్రాంతంలో ఒకరిద్దరు నేతలు అభద్రతాభావంతో పార్టీని వీడినా తెలుగుదేశం పార్టీ బలంగానే ఉందని పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా టిడిపి నేతలతో గురువారం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షుడుని ఎంపిక చేసే విషయమై వారితో చంద్రబాబు చర్చలు జరిపారు.
ఎన్నికల తర్వాతే రెండు ప్రాంతాలకు స్టేట్ కమిటీలు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులపై రెండు ప్రాంతాల్లో వేర్వేరు కమిటీలు వేయనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర సమితి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో భావసారూప్యత ఉన్న పార్టీలతో పొత్తులు ఉంటాయని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాతే రెండు ప్రాంతాల్లో స్టేట్ కమిటీలు నియమించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications