జగన్ ఎమ్మెల్యేల సస్పెన్షన్, అరెస్ట్: విజయమ్మ వాకౌట్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులను శాసనసభ నుండి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. గురువారం ఉదయం రెండుసార్లు వాయిదా పడిన సభ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తిరిగి ప్రారంభమైంది. ఈ సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు చర్చ కంటే ముందు ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ పదిహేను మంది ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేశారు.
విజయమ్మ వాకౌట్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులను శాసన సభ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ నుండి వాకౌట్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యేలు సభలోనే ఉండి జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేశారు. చంద్రబాబు, కిరణ్ సమైక్య ద్రోహులు అని ఆరోపించారు. వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సమైక్యాంధ్ర అంటే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేల అరెస్ట్
అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ నెంబర్ 1 వద్ద ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, శాసన మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలను కూడా సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్ అయిన ఎమ్మెల్యేలు
సస్పెన్షన్ అయిన వారిలో అమర్నాథ్ రెడ్డి, గొల్ల బాబురావు, తెల్లం బాలరాజు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, కాపు రామచంద్రా రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శోభా నాగి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసులు, సుచరిత, వెంకట్రామి రెడ్డిలు ఉన్నారు.












Click it and Unblock the Notifications